హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి కోరారు. ఇదే విషయమై తాము అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తామని చెబుతూ.. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకన్నా తమకే ఎక్కువ సంఖ్యా బలం ఉందని అసదుద్దీన్ ఓవైసి అన్నారు. తమ పార్టీ నేతలు త్వరలోనే అసెంబ్లీ స్పీకర్‌ని కలుస్తారని, ఈ విషయంలో స్పీకర్ కూడా సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం ఉందని అసదుద్దీన్ ఓవైసి ఆశాభావం వ్యక్తంచేశారు.


ఇదిలావుంటే, టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ని కలిసి సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం, వారి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందిస్తూ సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడం వెనువెంటనే జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో టీఆర్ఎస్‌పై తీవ్ర ఆగ్రహంతో వున్న కాంగ్రెస్ పార్టీ.. నేడు హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగింది. టీఆర్ఎస్ వైఖరిని విమర్శిస్తూ 36 గంటలపాటు ధర్నా చేపట్టనున్నట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.