తెలంగాణ తల్లిగా సోనియా ; కాంగ్రెస్ ప్రచారం ఫలించేనా ?
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ... సోనియాను రంగంలోకి దించుతోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆమె మేడ్చల్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో వచ్చిన సోనియా మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత ఆమెకు తెలంగాణ గడ్డపై అడుగుపెడుతున్నారు. దీంతో ఆమె స్పీచ్ కోసం సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
సోనియా ప్రచారం గతంతో ఫ్లాప్ ..మరి ఇప్పుడు..?
కాంగ్రెస్ నేతలు ఆమెను తెలంగాణ తల్లిగా ప్రమోట్ చేస్తున్నారు. సోనియా దయ వల్లే తెలంగాణ సాధ్యపడిందని..ఇందులో కేసీఆర్ చేసింది ఏమీ లేదని టి కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. గత ఎన్నికల్లో తెలంగాణ తెచ్చింది..ఇచ్చింది తామేనని కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. సోనియా సైతం తెలంగాణ గడ్డపై అడుపెట్టి ప్రచారం నిర్వహించిన ఫలించలేదు..ఫలితంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
అయితే అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరని టి.కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. కేసీఆర్ నమ్మి ప్రజలు మోసపోయారని.. నాలుగేళ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ పాలన పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోనియా ప్రచారంతో తమకు కలసివస్తుందని..తెలంగాణ ఇచ్చిన దేవతగా ప్రజలు సోనియాను ఇప్పటికీ ఆరాధిస్తున్నారని.. ఆమె గనుక ప్రచారం చేస్తే తమ గెలుపు ఈజీ అవుతుందని వాదిస్తున్నారు. కాంగ్రెస్ నేతల వాదిస్తున్నట్లు సోనియా ప్రచారంతో కాంగ్రెస్ ఆశిస్తున్నఫలితం దక్కుతుందో లేదో వేచిచూడాల్సింది.
సోనియా స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి
సుదీర్ఘవిరామం తర్వాత తెలంగాణ గడ్డపై అడుగుపెడుతున్న సోనియా ఏ మాట్లాడతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఇచ్చామని చెప్పడంతో పాటు ఈ నాలుగున్నరేళ్లలో కేసీఆర్ పాలన వైఫల్యాలను సోనియా ఎండగట్టే అవకాశముంది. రాబోయే తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుందో కూడా చెబుతారని టాక్. ఈ సభలో సోనియా కంటే ముందు మిగతా నేతలు కేసీఆర్‌పై తీవ్రంగానే విమర్శించే అవకాశముంది.