TPCC President: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉండడంతో ఆయన పీసీసీ అధ్యక్ష బాధ్యతను వదులుకోవాల్సి ఉంది. పార్టీ నిబంధనల ప్రకారం ఒకే వ్యక్తి రెండు పదవులు ఉండరాదు. అయినా కూడా రేవంత్‌ రెడ్డి 8 నెలలుగా జోడు పదవులతో కొనసాగుతున్నారు. వరుసగా ఎన్నికలు ఉండడంతో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను కొనసాగించారు. కానీ ఇప్పుడు మార్చాల్సి ఉంది. రేవంత్‌ కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా పీసీసీ బాధ్యతలు ఎవరు చేపడతారునేది ఉత్కంఠగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: రేవంత్‌ ఆగ్రహం


ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండడంతో పీసీసీ అధ్యక్ష పదవి హాట్‌ కేక్‌గా మారింది. సీనియర్లు మొదలుకుని జూనియర్ల వరకు పీసీసీ అధ్యక్ష రేసులో ఉన్నారు. ప్రభుత్వంలో సీనియర్లకు కొందరికి న్యాయం లభించింది. లోక్‌సభ ఎన్నికల్లో మరికొందరు సంతృప్తి చెందారు. ఈ క్రమంలో అధ్యక్ష పదవి సీనియర్లు కాకుండా జూనియర్లకు ఇస్తారని చర్చ జరుగుతోంది. అయితే అధ్యక్ష పదవి మాత్రం రేవంత్‌ రెడ్డి వర్గానికే లభిస్తుందని చర్చ జరుగుతోంది.


Also Read: MLAs Jump: ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్‌లో కలకలం.. రేవంత్‌ తీరుతో సీనియర్‌ నాయకుడు రాజీనామా?


దాదాపు వారం రోజులుగా రేవంత్ దేశ రాజధాని ఢిల్లీలో మకాం వేశారు. శుక్రవారం రాష్ట్రానికి రావాల్సి ఉన్నా పీసీసీ అధ్యక్ష పదవిపై ఏదో ఒకటో తేల్చాలనే ఉద్దేశంతో అక్కడే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ తదితరులు ఢిల్లీలో ఉన్నారు. పదవి ఆశిస్తున్న ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ పార్టీ అగ్ర నాయకత్వాన్ని కలిసి తమ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పార్టీ అగ్ర నాయకులు సోనియా, రాహుల్‌తో సమావేశమైన రాష్ట్ర నాయకత్వం కేసీ వేణుగోపాల్‌తో కూడా చర్చించింది.


రేవంత్ వర్గానికే..?
పార్టీ సీనియార్టీ పరంగా చూస్తే మధుయాష్కీకి అవకాశాలు ఉన్నాయి. సామాజికంగా కూడా ఒక బలమైన వర్గానికి ఇచ్చినట్టు ఉంటుందనే చర్చ జరుగుతోంది. మధు యాష్కీ గౌడ్‌కు రేవంత్‌ ఆశీస్సులు కూడా ఉన్నాయి. అతడికి ఇచ్చినా రేవంత్‌ వర్గం ఆహ్వానిస్తుంది. కాకుండా మహేశ్‌ కుమార్‌ రెడ్డికి పీసీసీ బాధ్యతలు ఇప్పించాలనే పట్టుదలతో రేవంత్‌ వర్గం ఉంది. ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. తాజాగా తెరపై ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి పేరు చర్చకు వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు.. సీనియర్‌ నాయకుడు, రైతు నేపథ్యం ఉంది. బీఆర్‌ఎస్‌ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ చేరికతో టీ కప్పులో తుపాన్‌ చెలరేగిన విషయం తెలిసిందే.

రేసులోకి మరో ఇద్దరు?
తన పరువుకు భంగం కలిగిందనే భావనతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్‌ రెడ్డికి పీసీసీ బాధ్యతలు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జీవన్‌ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా ఎలాంటి పదవులు రాకపోవడంతో పీసీసీ బాధ్యతలు ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నారు. వీరు కాకుండా మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. మాస్‌ నాయకుడు.. మెదక్‌ జిల్లాలో బలం బాగా ఉండడంతో ఆయనను పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం జగ్గారెడ్డి కూడా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఇలా ముగ్గురి నలుగురి పేర్లు చర్చపై ఉన్నాయి.


సీనియర్ల మౌనం
సీనియర్‌ నాయకులైన ఉత్తమ్‌, కోమటిరెడ్డి సోదరులు, భట్టి, జానారెడ్డి, వీహెచ్‌ తదితరులు పీసీసీ పదవిని ఆశించడం లేదు. గతంలో ఈ పదవి కోసం కొట్టుకునే దాకా వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడంతో రేవంత్‌ రెడ్డి నిర్ణయమే ఫైనల్‌గా తెలుస్తోంది. రేవంత్‌ అభిప్రాయమే ఫైనల్‌ అయితే మధుయాష్కీ లేదా మహేశ్‌ కుమార్‌ రెడ్డికి పీసీసీ బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరినీ ప్రకటిస్తారో వేచి చూడాలి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter