Telangana Politics:  వలస నేతలు బీజేపీలో  ఇమడలేకపోతున్నారా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కమలం పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదా.. అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు పోటిపడి మరీ కమలం గూటికి చేరారు. తమ పార్టీలోకి చేరికలు భారీగా ఉండబోతున్నాయని కొంత కాలంగా బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాని ఆ పార్టీలోకి వలసలు లేకపోగా.. జంపింగులు ఎక్కువయ్యాయి. గత వారం రోజులుగా రోజు ఎవరో ఒక కీలక నేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పేసి.. కారు ఎక్కేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోటి ఆశలతో బీజేపీలో చేరినా అక్కడ ఇమడలేక బయటకి వచ్చిన నేతల లిస్ట్ భారీగానే ఉంది. నాగం జనార్ధన్ రెడ్డి మొదలుకొని ఆనంద భాస్కర్ వరకు ఆ లిస్టు పెద్దగానే ఉంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో దూకుడుగా వ్యవహరించిన మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి..  బీజేపీలో చేరారు అయితే ఆ పార్టీలో ఇమడలే కొంత కాలానికి  కాంగ్రెస్ లో చేరారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, బోడ జనార్ధన్  లు కమలం పార్టీతో ఎక్కువ కాలం క్యారీ కాలేకపోయారు. తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ  మాజీ మంత్రులు బయటికి వచ్చేశారు. పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బోడ జనార్ధన్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మాజీ మంత్రులుగా ఉన్న తమను బీజేపీలో ఎవరూ పట్టించుకోలేదని వాళ్లు ఆరోపించారు.


తెలంగాణ తొలి శాసనమండలి చైర్మెన్ గా పని చేసిన స్వామి గౌడ్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఆశించిన స్వామిగౌడ్.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో తనకు సరైన ప్రాధాన్యత లేదని ఆయన చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎర్ర శేఖర్, బూడిద బిక్షమయ్య గౌడ్ కూడా బీజేపీలో ఉండలేకపోయారు. తెలంగాణ ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్ కూడా బీజేపీలో చేరిన నెలన్నర రోజుల్లోనే ఆ పార్టీని వీడారు.టీడీపీలో కీలక నేతలుగా ఉన్న బండ్రు శోభారాణి, కొండ్రు పుష్పలీలలు బీజేపీలో చేరిన కొంత కాలానికే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. తాజాగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. చేనేతల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న కృషిని అభినందించారు. బీజేపీకి రాజీనామా చేయబోతున్నానని, అతి త్వరలో టీఆర్ఎస్‌లో చేరబోతున్నానని ప్రకటించారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధింపును వ్యతిరేకిస్తున్నానని చెప్పిన రాపోలు.. చేనేత సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ చర్యలు అద్భుతమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారు చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంద‌ని.. ఇది నేత కార్మికుల ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా తయారైందని ఆవేద‌న వ్యక్తం చేశారు.


ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు వరుసగా.. ఆ పార్టీకి రాజీనామా చేస్తుండటంతో వలస నేతలకు బీజేపీలో ప్రాధాన్యత దక్కడం లేదా.. అందుకే వాళ్లంతా తిరిగి సొంత గూటికి వస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. బీజేపీలోని వర్గ పోరు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు తలనొప్పిగా మారిందంటున్నారు. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వర్గాలు ఉన్నాయనే టాక్ మొదటి నుంచి ఉంది. కొత్తగా వచ్చిన నేతలకు ఇది ఇబ్బందిగా మారిందంటున్నారు. కిషన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే సంజయ్ వర్గం టార్గెట్ చేస్తుందనే ప్రచారం సాగుతోంది. హుజురాబాద్ లో విజయం తర్వాత ఈటల గ్రాఫ్ పెరిగింది. చేరికల కమిటి చైర్మెన్ గా ఆయన కూడా కొంత మంది నేతలు పార్టీలోకి తీసుకువచ్చారు. అయితే ఈటల మనుషులుగా గుర్తింపు వచ్చిన నేతలకు సంజయ్ టీమ్ నుంచి సరైన ప్రాధాన్యత దక్కడం లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల వల్లే వలస నేతలు కమలం పార్టీలో ఇమడలేక సొంత గూటికి చేరుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ పెద్దలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు చేరికల కమిటీతో పాటు బుజ్జగింపుల కమిటి కూడా వేసుకోవాలంటూ బీజేపీపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి.


Also Read : Virat Kohli, Anushka Sharma: మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఏం చేశాడో తెలుసా ?


Also Read : Blenders Pride Full Bottle: ఓటరుకో బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్ మద్యం పంపిణి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి