ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బాణాసంచా, లేజర్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. ఈ ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వచ్చారు. సీఎం కేసీఆర్,  తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రం నలుమూలల నుండి ఉపాధ్యాయులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలు, పండితులు, జ్ఞానపీఠ్, కేంద్ర సాహితీ అవార్డు గ్రహీతలు.. దేశ విదేశాల నుంచి భాషాభిమానులు అందరూ మహా సభలలో పాల్గొనటానికి తరలివచ్చారు.


సాయంత్రం ఆరు గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వేదిక వద్దకు రాగానే పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన్ను గవర్నర్లు నరసింహన్, విద్యాసాగర్ రావు వేదిక వద్దకు తీసుకువచ్చారు. పేరణి నృత్యంతో మహాసభలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రముఖులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. 


అనంతరం సీఎం కేసీఆర్ చిన్ననాటి గురువు మృత్యుంజయ శర్మ ను సత్కరించి.. పాదాభివందనం చేశారు. సాహితీ అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. సీఎం కేసీఆర్ తనదైన శైలిలో కవితలు, పద్యాలు, సామెతలతో ప్రసంగించారు.  అనంతరం మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, గవర్నర్ నరసింహన్  తెలుగులో మాట్లాడారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తొలిసారి తెలుగులో ప్రసంగించడం.. అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. తరువాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  కవితలు, అమ్మభాష మాధుర్యం తదితర అంశాలతో ప్రసంగం ధారాళంగా సాగింది.