FIR on Professor Haragopal: ప్రొ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు నమోదు
FIR Filed Against Professor Haragopal: పౌరహక్కుల సంఘాల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌పై తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో దేశ ద్రోహం కేసు నమోదైంది. మావోయిస్టులకు ప్రొఫెసర్ హరగోపాల్ సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే అభియోగాల కింద గత ఏడాది ఆగస్టు 19నే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
FIR Filed Against Professor Haragopal: పౌరహక్కుల సంఘాల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌పై తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో దేశ ద్రోహం కేసు నమోదైంది. మావోయిస్టులకు ప్రొఫెసర్ హరగోపాల్ సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే అభియోగాల కింద గత ఏడాది ఆగస్టు 19నే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యమకారులు, మేధావులు, పౌరహక్కుల సంఘాల నేతలు, ప్రజాసంఘాల సభ్యులను అజ్ఞాత ఎఫ్‌ఐఆర్‌లతో వేధిస్తున్నారని పౌరహక్కుల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుల పుస్తకాల్లో పేర్లు ఉన్నాయంటూ 152 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, అందులో కొంతమందిని అరెస్ట్ చేసి ప్రశ్నించడం వంటి పరిణామాలు రాష్ట్రంలో చర్చనియాంశమయ్యాయి. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ ( పీడీఎం ) అధ్యక్షుడు చంద్రమౌళిని 2 నెలల కింద పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు తెలిపారు. చంద్రమౌళికి బెయిల్ ఇవ్వకూడదు అంటూ కోర్టును విజ్ఞప్తి చేశారు.
అయితే, పోలీసుల వాదనతో ఏకీభవించని కోర్టు.. అన్ని కేసుల వివరాలు అందజేస్తే.. వాటిని పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని పోలీసులను ఆదేశించినట్టు తెలిసింది. కోర్టు ఆదేశాలపై స్పందించిన పోలీసులు.. చంద్రమౌళి పేరుతో ఉన్న మరో ఎఫ్‌ఐఆర్‌ను ప్రస్తావించగా.. అందులో ప్రొఫెసర్ హరగోపాల్ పేరు ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు ప్రొఫెసర్ హరగోపాల్ పై కేసు నమోదైనట్టుగానే తెలియకపోవడం గమనార్హం.
ఏడాది కింద 152 మందిపై పోలీసులు బీరెల్లి కుట్ర కేసు నమోదు చేశారు. అందులోనే పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ అధ్యక్షుడు చంద్రమౌళితో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ పేరు కూడా ప్రస్తావించినట్టు తేలింది. తనపై తనకే తెలియకుండా కేసు నమోదవడంపై ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ అక్రమ కేసు ఒక ఉదాహరణ అని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజాషా లాంటి మేధావులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే కొట్టివేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు ప్రొఫెసర్ హరగోపాల్ పేరు రహస్యంగా ఉన్న ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడు కోర్టు ఆదేశాలతో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇక పోలీసులు ప్రొఫెసర్ హరగోపాల్ విషయంలో ఎలా వ్యవహరిస్తారు అనే అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. అంతేకాకుండా బీరెల్లి కుట్ర కేసులో అసలు ఇప్పటివరకు 152 మందిపై కేసు నమోదైతే.. అందులో కొంతమంది విషయంలో పోలీసులు ఇప్పటివరకు ఎందుకు మౌనం వహిస్తున్నట్టు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.