సౌదీ అరేబియా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధక శాఖ వారి సూచనల మేరకు 11 మంది యువరాజులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను, బిలియనర్లను కూడా అరెస్టు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో సౌదీ జాతీయ భద్రతాదళ ప్రధానాధికారి, ఆర్థికశాఖ మంత్రిని కూడా అరెస్టు చేయడం గమనార్హం. అత్యుత్తమ స్థాయిలో ఉండి కూడా ప్రజల సొమ్మును కొల్లగడుతున్న నాయకులు భరతం పట్టాలని, అలా చేసేవారు ఇస్లామ్‌కి వ్యతిరేకమని కూడా అవినీతి నిరోధక శాఖ ప్రకటించింది. ఇటీవలే మహ్మద్ బిన్ సాల్మన్ ప్రధాన యువరాజుగా (రాజు తర్వాతి స్థానం) అధికారం చేపట్టిన సందర్భంగా ప్రభుత్వం కొత్తగా అవినీతి నిరోధక కమీషనును ప్రారంభించింది.


కమీషన్ ప్రారంభమైన కొద్ది గంటలే సౌదీ రాజు ఆదేశం మేరకు అరెస్టుల పర్వం ప్రారంభమయ్యింది. కొత్త కేసులతో పాటు పాత కేసులలో కూడా నిందితులుగా ఉన్నవారిని ఈ సందర్భంగా అరెస్టు చేసింది పోలీసు యంత్రాంగం.


ప్రధాన యువరాజుగా అధికారం చేపట్టిన 32 ఏళ్ల మహ్మద్ బిన్ సాల్మన్ గతంలో రాజధాని రియాద్‌కు గవర్నరుగా కూడా పనిచేశారు.  మహ్మద్ బిన్ సాల్మన్ 2009లో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. 2011లో తన తండ్రకి ప్రైవేటు సలహాదారుగా పనిచేశారు.


ఆ తర్వాత రక్షణశాఖ మంత్రి స్థాయికి ఎదిగారు. సౌదీ ఆర్థిక వికాసానికి దోహదం చేసే విజన్ 2030కి సాల్మన్ నాయకత్వం వహించారు. అలాగే యూనెస్కో యూత్ ఫారమ్ ఫర్ ఛేంజ్‌కు పార్టనరుగా కూడా వ్యవహరించారు.