Taliban: అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో తాలిబన్ల అరాచక పాలన మొదలైంది. ఇప్పటికే స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మహిళలను ఎక్కడికక్కడ అణచివేస్తున్న తాలిబన్లు.. ఆ ఆందోళనలను కవర్‌ చేస్తున్న జర్నలిస్టులపైనా కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు. అత్యంత దారుణంగా వారిపై దాడులు చేస్తున్నారు. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు జర్నలిస్టుల ఫొటోలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ కాబుల్‌లోని కర్తే ఛార్‌ ప్రాంతంలో తాలిబన్ల ప్రభుత్వాని(Taliban Government)కి వ్యతిరేకంగా కొందరు మహిళలు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనను అడ్డుకున్న తాలిబన్లు.. దీన్ని కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా దాడులకు తెగబడ్డారు. అఫ్గాన్‌ మీడియా(Afghan Media) సంస్థ ఎట్లియాట్రోజ్‌కు చెందిన వీడియో ఎడిటర్‌ తాఖీ దర్యాబీ, రిపోర్టర్‌ నెమతుల్లా నక్దీలను తాలిబన్లు తీసుకెళ్లి వారి పట్ల అమానుషంగా ప్రవర్తించారని సదరు మీడియా సంస్థ వెల్లడించింది. వారిని తీవ్రంగా కొట్టారని తెలిపింది. ఆ తర్వాత కొంతసేపటికి వారిని విడిచిపెట్టినట్లు పేర్కొంది. శరీరంపై గాయాలతో ఉన్న జర్నలిస్టుల(Journalists) ఫొటోలను ఆ సంస్థ ట్విటర్‌ వేదికగా విడుదల చేసింది.


ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియా(Social Media)లో వైరల్‌ అవుతున్నాయి. కొందరు విదేశీ మీడియా సంస్థల ప్రతినిధులు వీటిని షేర్‌ చేస్తూ.. తాలిబన్ల పాలన(Taliban Rule)లో మానవ హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహిళల నిరసనను కవర్‌ చేస్తున్న ఓ వీడియో గ్రాఫర్‌ను తాలిబన్లు అదుపులోకి తీసుకుని ముక్కు నేలకు రాయించిన విషయం తెలిసిందే. మరో జర్నలిస్టును కాలితో తన్ని అతడి వద్ద ఉన్న కెమరాను లాక్కున్నారు. 



కాబుల్‌లో ఇంటర్నెట్‌ నిలిపివేత
ఇదిలా ఉండగా.. తాలిబన్లకు వ్యతిరేకంగా రాజధాని కాబుల్(Kabul) వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టిన తాలిబన్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం.. కాబుల్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. అంతేగాక, ఆందోళనకారులు 24 గంటల ముందు నిరసనల కోసం అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.