ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్యసమితి (ఐరాస) సదస్సులో కీలకోపన్యాసం చేశారు. ఐరాసలో ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న  'సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత...అంతర్జాతీయ సవాళ్లు- అవకాశాలు' అనే అంశంపై ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. తొలుత కొద్దిసేపు సీఎం చంద్రబాబు తెలుగులో ప్రసంగించారు. సీఎం తెలుగులో మాట్లాడటంతో సభికుల నుంచి హర్షధ్వానాలు వెల్లువెత్తాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ఎరువులు, పురుగుల మందు వాడకుండా వ్యవసాయం చేయడం సాధ్యమేనని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంతో ఏపీ ప్రపంచానికే ఆదర్శంగా మారిందన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం అమలుతీరును సీఎం చంద్రబాబు వివరించారు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్‌ సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై ఆయన చర్చించారు.


ప్రకృతి వ్యవసాయం వల్ల నాణ్యమైన ఆహారం పొంది 100 ఏళ్లు బతకొచ్చని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. రానున్న ఐదేళ్లలో వందశాతం ప్రకృతి వ్యవసాయం అమలు చేస్తామని  చంద్రబాబు తెలిపారు. ఈ సమావేశంలో కీలక ప్రసంగాలు చేసిన తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం. ప్రకృతి సేద్యంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల అంతర్జాతీయ సంస్థలు కితాబిచ్చాయి.