బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి బెయిల్ మంజూరు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి ఖలిదా జియాకు నాలుగు నెలల బెయిల్ లభించింది.
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి ఖలిదా జియాకు నాలుగు నెలల బెయిల్ లభించింది. అవినీతి ఆరోపణల కేసులో ఆమెకు అయిదేళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె బంగ్లాదేశ్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఓ చిన్నారుల స్వచ్ఛంద సంస్థ (అనాథాశ్రమం)కు వచ్చే అంతర్జాతీయ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై 72 ఏళ్ల జియాకు గతనెలలో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇటీవల ఢాకా కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆమె ఈ ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు దూరం అయ్యారు.
తనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ కక్షతో ఎవరో చేస్తున్నావే అని ఆమె గతంలో ఆరోపించారు. జియాపై పదుల సంఖ్యలో పెండింగ్ కేసులు ఉన్నాయి. గత నెలలో కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించినప్పటి నుంచి ఢాకాలోని ప్రత్యేక జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుత ప్రధాని షేక్ హసీనాకు ఆమె ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. ఇదే కేసులో జియా కుమారుడు తారిక్ రెహ్మాన్‌కు ఢాకా కోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించింది. కాగా.. సోమవారం కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.