అది కౌలాలంపూర్ నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు బయల్దేరిన విమానం. శనివారం మలిండో ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం అలా గాల్లోకి లేచిందో లేదో బంగ్లాదేశ్‌కి చెందిన ఓ యువ ప్రయాణికుడు వెంటనే హడావుడిగా బట్టలిప్పేయడం మొదలుపెట్టాడు. తోటి ప్రయాణికులకు అసౌర్యంగా వుంటుందనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అందరి ముందే ల్యాప్‌టాప్ తెరిచి అశ్లీల దృశ్యాలు చూడటం మొదలుపెట్టాడు. అతడి విపరీత ప్రవర్తన చూసి అవాక్కైన ఫ్లైట్ సిబ్బంది వారించడంతో మొదట వారి మాట విన్న సదరు యువకుడు తిరిగి బట్టలేసుకున్నాడు. అనంతరం మళ్లీ ఓ మహిళా సిబ్బందిని కౌగిలించుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించబోయాడు. అతడి ప్రయత్నాన్ని అడ్డుకోబోయిన మరో సిబ్బందిపైన చేయి చేసుకున్నాడు ఆ యువకుడు. దీంతో ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బంది కలిసి అతడి చేతులని వెనక్కి పెట్టి కట్టేశారు.


మలేషియాకు చెందిన యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుకుంటున్న ఆ యువకుడు తాను చేసిన తప్పిదానికి కౌలాలంపూర్ నుంచి ఢాకా వరకు అలాగే చేతులు వెనక్కి పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇండోనేషియాకు చెందిన ఎయిర్ లైన్స్ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం ఢాకాకు చేరుకున్న వెంటనే అక్కడి విమానాశ్రయం పోలీసులు ఆ యువకుడిని అదుపులోక తీసుకున్నట్టు సమాచారం.