బిల్ గేట్స్ చేసిన ఓ చిన్న పని ఆయన్ను మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలబెట్టింది. అందుకు ఆయన చేసింది ఏం లేదు.. జస్ట్ తనకు కావాల్సిన బర్గర్, ఫ్రై ఫుడ్ కోసం ఓ ఫుడ్ చైన్ ముందు వరుసలో నిలబడటమే. అవును, ప్రపంచకుబేరుల్లో అందరికన్నా ముందుండే బిలియనేర్ బిల్ గేట్స్ గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియని వారుండరు. వ్యాపారంలో డబ్బు సంపాదించడంలోనే కాదు.. సేవ చేయడంలోనూ మీకు నేనున్నాను అని అందరికన్నా ముందు నిలిచే బిల్ గేట్స్ తాజాగా షియాటిల్‌లో డిక్స్ డ్రైవ్ ఇన్ అనే ఫుడ్ చైన్ వద్ద బర్గర్, ఫ్రైస్, ఓ కోక్ బాటిల్ కొనుగోలు చేశాడు. మైక్రోసాఫ్ట్ వ్యవస్తాపకుడిగా బిలియన్ల కొద్ది డాలర్లు సంపాదించిన బిల్ గేట్స్ తలుచుకుంటే, అన్నీ తన కాళ్ల వద్దకు తెప్పించుకోగలడు. ఒకవేళ తానే రెస్టారెంట్ వద్దకు వెళ్లినట్టయితే, కారులోంచి కిందకు దిగకుండా కారు వద్దకే తనకు కావాల్సినవి తెప్పించుకునేంత సామర్థ్యం, కావాల్సినంత మంది సిబ్బంది ఆయన సొంతం. కానీ బిల్ గేట్స్ అలా చేయలేదు. తానే వెళ్లి క్యూలో నిలబడి తనకు కావాల్సినవి ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్నాడు. అక్కడ బిల్ గేట్స్ తమతోపాటే క్యూలో నిలబడటం చూసి షాకవడం ఆ రెస్టారెంట్ కస్టమర్ల వంతయ్యింది. 


డైలీ మెయిల్ ఆన్‌లైన్ తెలిపిన వివరాల ప్రకారం బర్గర్ ధర $3.40, ఫ్రైస్ ధర $1.90, పెద్ద కోక్ ధర $2.38. అన్నీ కలుపుకుని $7.68 అయ్యాయన్న మాట. అంటే, భారతీయ కరెన్సీలో ఆ మొత్తం విలువ రూ. 547 అన్నమాట.