ఆకాశంలో కనువిందుచేసిన అరుణ చంద్రోదయం
ఆకాశంలో అద్భుతం జరిగింది.
ఆకాశంలో అద్భుతం జరిగింది. శుక్రవారం రాత్రి అరుదైన అరుణవర్ణ సంపూర్ణ చంద్రగ్రహణం ఖగోళ ప్రేమికులను కనువిందు చేసింది. రాత్రి 10 గంటల 44 నిమిషాలకు మొదలైన సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం.. అర్థరాత్రి ఒంటి గంట తర్వాత సంపూర్ణ దశకు చేరుకొని తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగింది.
మునుపెన్నడూ లేని విధంగా చంద్రుడు, అంగారకుడు ఆకాశంలో జత కట్టారు. చంద్రుడి పక్కనే అంగారకుడు అరుణవర్ణంలో (రెడ్ కలర్) కనువిందు చేశాడు. దీంతో చంద్రుడు కూడా ఎర్రగా మారిపోయి బ్లడ్ మూన్‌లా కనిపించాడు. 15 ఏళ్ల తర్వాత ఏర్పడ్డ ఈ అరుదైన అరుణోదయ గ్రహణం మనదేశంతోపాటు జర్మనీ, బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, దక్షిణ అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్, కువైట్‌లలో కనిపించింది. మన దేశంలో ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరులో స్పష్టంగా కనిపించింది.
సంప్రదాయాలు, ఆచారాలపై నమ్మకం ఉన్న వాళ్లు ఇళ్లకే పరిమితం అయ్యారు. మరికొందరు ఈ వందేళ్ల అద్భుతాన్ని ఆసక్తిగా గమనించారు. టెలిస్కోపు, బైనాక్యులర్స్, అబ్జర్వేటరీలతో 21వ శతాబ్దపు సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించారు. నాసా సంపూర్ణ చంద్రగ్రహణాన్ని లైవ్‌లో ప్రసారం చేసింది. మూన్ నుంచి.. బ్లడ్ మూన్‌గా మారిన చందమామ దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించింది.
గ్రహణ రోజైన శుక్రవారం రాత్రి నుంచి వరుసగా నాలుగైదు రోజులపాటు అంగారక గ్రహాన్ని వీక్షించవచ్చు. ఈ నెల 31న.. భూమికి అతిచేరువగా అంగారకుడు రానున్నాడు. 31న.. మరింత ప్రకాశవంతంగా అంగారకుడు కనిపిస్తాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం ఏర్పడాలంటే మరో 105 ఏళ్లు పడుతుందన్నారు శాస్త్రవేత్తలు. అంటే.. 2123వ సంవత్సరంలో బ్లడ్ మూన్ కనిపిస్తాడన్న మాట..!