క్యాన్సర్ చికిత్సలో కొత్త అధ్యాయం: వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారాలు
క్యాన్సర్ చికిత్సలో కొత్త అధ్యాయం: వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారాలు
2018 ఏడాదికి గానూ నోబెల్ బహుమతులను ప్రకటించారు. కేన్సర్ చికిత్సలో పరిశోధనలకుగాను ఇద్దరు వైద్యులు ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపికైనట్లు సోమవారం స్టాక్‌హోమ్‌లోని నోబెల్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. అమెరికాకు చెందిన జేమ్స్.పి.అలిసన్, జపాన్‌కు చెందిన టసూకు హోంజోలు వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.
జేమ్స్.పి.అలిసన్, టసూకు హోంజోలకు 'ఇన్హిబిషన్ ఆఫ్ నెగటివ్ ఇమ్యూన్ రెగ్యులేషన్' పద్ధతిలో అత్యంత ప్రాణాంతకమైన కేన్సర్‌కు చికిత్స చేసే ప్రక్రియను కనుగొన్నందుకుగాను నోబెల్ పురస్కారం లభించింది. ఇమ్యూన్ చెక్‌పాయిట్ థెరపీని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీంతో క్యాన్సర్ వ్యాధి చికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
ఈ ఇద్దరూ అభివృద్ధి చేసిన చికిత్స విధానం.. క్యాన్సర్ చికిత్సలో కొత్త అధ్యాయాన్ని లిఖించినట్లు నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. ఈ ఇద్దరు వైద్యులు నోబెల్ పురస్కారంతో పాటు 9 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల(7,80,000 పౌండ్లు) నగదు బహుమతిని కూడా వీరు అందుకోనున్నారు. ఏటా మెడిసిన్ విభాగంలో తొలి నోబెల్ బహుమతిని ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.
వైద్యం, భౌతిక, రసాయన, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి ప్రతి ఏటా నోబెల్ బహుమతి ప్రదానం చేస్తారు. నోబెల్ బహుమతి ప్రదానోత్సవము ప్రతి సంవత్సరము ఆల్ఫ్రెడ్ నోబెల్ (నోబెల్ బహుమతి స్థాపకుడు) వర్ధంతినాడు అనగా డిసెంబరు 10వ తేదీన జరుపబడుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి ఇవ్వడం లేదని నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది.
అటు భౌతిక శాస్త్రంలో అక్టోబరు 2న, రసాయన శాస్త్రంలో అక్టోబరు 3న పురస్కారాలు ప్రకటించనున్నట్లు తెలిపింది. అక్టోబరు 5 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబరు 8న ఆర్థిక రంగంలో నోబెల్ పురస్కారాల విజేతలను వెల్లడించనున్నట్లు నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది.