అంతరిక్షంలో కక్ష్య నుంచి అదుపుతప్పిన చైనా నౌక మరికొద్ది గంటల్లో భూమిని ఢీకొట్టనున్నట్లు చైనా స్పేస్ అకాడమీ వెల్లడించింది. 2016లోనే అదుపుతప్పిన ఈ నౌక చక్కర్లు కొడుతూ ఇప్పుడు భూమికి చేరువగా వస్తోందని తెలిపింది. వాతావరణంలోకి ప్రవేశించిన అనంతరం గంటకు 26 వేల కిలోమీటర్ల వేగంతో ఈ నౌక భూమిని ఢీకొట్టనుందని ..ఈ సమయంలో జరిగే నష్టాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు స్పేస్ అకాడమీ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతి తప్పిన ఆ చైనా నౌక పేరు టియాంగ్‌గాంగ్-1. ఇప్పుడు అది ప్రయాణిస్తున్న కక్ష్య  ఆధారంగా 43 డిగ్రీల ఉత్తర, 43 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య సాగుతోంది. దీన్ని బట్టి చూస్తే ఈ నౌక శకలాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా మధ్య పశ్చిమ ప్రాంతంలో ఎక్కడైనా భూమిని తాకే వీలుంది. అయితే భూ కక్ష్యలోకి చేరేలోపే ఇది మండిపోయే వీలున్నందున ఎలాంటి ముప్పు ఉండదని  శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. అయినా చైనా అంతరిక్ష సంస్థతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు దీని కదలికలను గమనిస్తున్నాయన్నారు.


చైనా తొలి అంతరిక్ష పరిశోధన కేంద్రంగా టియాంగ్‌గాంగ్‌ను 2011లో కక్ష్యలోకి పంపించారు. అయితే ఐదేళ్లు బాగానే పనిచేసిన తరువాత 2016లో ఈ నౌక భూ కేంద్రం నుంచి అదుపుతప్పింది. అప్పటి నుంచి అంతరిక్షంలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పుడు భూమికి చేరువలో వస్తోంది. ఆదివారానికి ఈ నౌక భూ వాతావరణానికి 179 కిలోమీటర్ల దూరంలో ఉందని చైనా అంతరిక్ష సంస్థ వెల్లడించినట్లు హాంగ్‌కాంగ్ నుంచి వెలువడే సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది. అదుపు తప్పి భూమి వైపు వస్తున్న ఈ ఎనిమిది టన్నుల నౌక వల్ల పెద్దగా ముప్పు లేదని చైనా అధికార వర్గాలు తెలిపాయి.