అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత మీడియాపై కోప్పడ్డారు ‘మీడియా అనేది ఫేక్ అన్నమాట నూటికి నూరుపాళ్ళు సత్యం‌. అసలు ఫేక్‌ అనే పదాన్ని కనిపెట్టిందే నేను. అయితే ఆ పదం చాలా రోజుల నుండి జనబాహుళ్యంలో ఉంది. ఆ విషయం ఇంతవరకు నేను గమనించలేదు. నేడు ఫేక్ వార్తల వల్ల అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మన దేశ గొప్పతనాన్ని మన మీడియాయే పణంగా పెట్టడం విచారకరం’ అని ట్రంప్‌ ప్రస్తుత మీడియా వ్యవస్థపై ఆరోపణలు చేశారు. ట్రంప్‌తో జరిగిన ఆ ముఖాముఖి కార్యక్రమం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఫేక్ అనే పదాన్ని ట్రంప్ కనిపెట్టాడనే విషయంలో అర్థం లేదని, ఆయనవి పొంతన లేని మాటలు అని కొందరు భాషావేత్తలు, రచయితలు ఆయనపై కామెంట్లు చేశారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం నుండే ఆ పదం వాడుకలో ఉన్నట్లు పేర్కొన్నారు.