బౌద్ధ గురువు దలైలామా ఇటీవలే కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశ తొలి ప్రధాని నెహ్రు ఆలోచనలు కొన్ని స్వార్థంతో ఉండేవని.. మహాత్మగాంధీ ప్రధానిగా మహ్మద్ ఆలీ జిన్నాకి అవకాశమిస్తే.. భారత్ రెండు ముక్కలై ఉండేది కాదని ఆయన తెలిపారు. అయితే ఆ వ్యాఖ్యలు ఆ తర్వాత పెద్ద దుమారమే రేపాయి. సోషల్ మీడియా వేదికగా అనేకమంది దలైలామా పై మండిపడ్డారు. ఈ క్రమంలో దలైలామా ఈ రోజు ప్రజలను క్షమాపణలు కోరారు. ప్రతీ ఒక్కరూ జీవితంలో ఏదో ఒక తప్పు చేయడం సహజమేనని.. తాను ఆ మాటలు అనకుండా ఉండాల్సిందని దలైలామా అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"నా వ్యాఖ్యలు ఇంత తీవ్ర దుమారం రేపుతాయని అనుకోలేదు. అందుకే నేను మాట్లాడిన అంశాలలో ఏవైనా తప్పులు ఉంటే ప్రజలను క్షమించమని కోరుతున్నాను" అని ఈ రోజు దలైలామా ప్రకటించారు. శంకాలిమ్ టౌన్‌లోని గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో టిబెటన్ వాసులు ఏర్పాటు చేసిన "థ్యాంక్యూ కర్ణాటక" కార్యక్రమానికి అతిధిగా వచ్చేసిన దలైలామా తన ప్రసంగంలో భాగంగా నెహ్రుపై వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సభకి కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా హాజరయ్యారు.


అయితే ఇదే సభలో దలైలామా టిబెట్ విషయంలో నెహ్రు చొరవ చూపారని చెబుతూ ఆయనను పొగడడం గమనార్హం. "టిబెటన్ వాసుల కోసం నెహ్రు ఎంతో చేశారు. టిబెటన్ స్కూలు కోసం ఆయన విద్యాశాఖ మంత్రిని సంప్రదించినప్పుడు కర్ణాటకలోని మైసూరు నుండి ప్రపోజల్ వచ్చింది. అప్పటి కర్ణాటక నేత నిజలింగప్ప ఆ విషయంలో ఎంతో సహకరించారు. నెహ్రు కూడా టిబెటన్ వాసుల కోసం ఆ సమయంలో చేయగలిగనంత చేశారు" అని దలైలామా అదే సభలో తెలిపారు. 83 ఏళ్ల దలైలామా మాట్లాడుతూ, టిబెటన్ సెటిల్‌మెంట్ విషయంలో నెహ్రు తమకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు.