వాషింగ్టన్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో జరిగే చారిత్రాత్మక భేటీకి వేదిక, తేదీలు ఖరారయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. శుక్రవారం వైట్‌హౌస్ నుంచి టెక్సాస్ పర్యటనకు బయలుదేరి వెళుతూ ట్రంప్ మీడియాతో మాట్లాడారు.


ఉత్తర కొరియాతో చర్చల్లో పురోగతి కనిపిస్తోందని, బందీల విషయమై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. అణు నిరాయుధీకరణ పూర్తయ్యే వరకు ఉత్తరకొరియాపై ఆంక్షలు కొనసాగుతాయని ఒక ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. ఉత్తర కొరియా రాజీకి సంకేతాలివ్వడంతో మే నెలాఖరులో కిమ్‌తో చర్చలకు సిద్ధమని మార్చిలో ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే..! కాగా, దక్షిణ కొరియా కాలమానంతో సరిపోయేందుకు వీలుగా ఉత్తర కొరియా తన కాలమానాన్ని అరగంట ముందుకు జరిపింది.