26/11 పేలుళ్ల సూత్రధారి హెడ్లీ పరిస్థితి విషమం..!
26/11 పేలుళ్ల సూత్రధారి, పాకిస్థానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీ(58) ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
26/11 పేలుళ్ల సూత్రధారి, పాకిస్థానీ అమెరికన్ డేవిడ్ కొల్మెన్ హెడ్లీ(58) మరణించాడా? అమెరికాలోని చికాగోలో మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్ (జైలు)లో శిక్ష అనుభవిస్తున్న హెడ్లీపై ఇద్దరు తోటి ఖైదీలు దాడిలో తీవ్రంగా గాయపడిన హెడ్లీ మరణించాడని అనధికారిక వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా జైలులో హెడ్లీపై ఇద్దరు ఖైదీలు దాడి చేశారనీ, ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని ఆ వార్తల సారాంశం.
డేవిడ్ హెడ్లీపై మే19న దాడి జరిగింది. పోలీస్‌పై దాడి చేసిన కేసులో 10 సంవత్సరాల జైలు జీవితం అనుభవిస్తున్న ఇద్దరు తోటి ఖైదీలుహెడ్లీపై దాడి చేశారని ధృవీకరించబడని వార్తలు పేర్కొంటున్నాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన హెడ్లీని ఆసుపత్రికి తరలించారని.. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 9న కన్నుమూశాడని స్థానిక కథనాలు ప్రసారమయ్యాయి. అయితే ఈ వార్తలను అమెరికా అధికారులు ధృవీకరించలేదు. హెడ్లీపై దాడి జరిగిన అంశం గురించి తమకు సమాచారం తెలియదని చికాగో అధికారులు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ హెడ్లీని ఇవాన్‌స్టన్ హాస్పటల్‌కు తీసుకువెళ్లారు. అయితే అక్కడి డాక్టర్లు.. ప్రస్తుతం ఆ పేరుగల పేషేంట్ లేరని చెబుతున్నారు. దీంతో హెడ్లీ చనిపోయాడా? పరిస్థితి విషమంగా ఉందా? అనే దానిపై క్లారిటీ అయితే లేదు.
పాకిస్తాన్ సంతతికి చెందిన డేవిడ్ హెడ్లే అమెరికావాసి. అమెరికాలో అధికారిగా పనిచేస్తూ పాక్‌కు వచ్చేవాడు. అదే సమయంలో హెడ్లీకి లష్కరే తోయిబాతో పరిచయం ఏర్పడింది. ఆతర్వాత హెడ్లీ.. ముంబైలో దాడి చేసేందుకు రెక్కీలు నిర్వహించడంలోనూ సాయం చేశాడు. 168 మంది ప్రాణాలు తీసుకున్న ముంబై ఘటన ( 26/11 పేలుళ్లు)కు హెడ్లీ ప్రధాన సూత్రధారిగా నిలిచాడు. 2009లో హెడ్లీని పోలీసులు అరెస్టు చేయాగా.. 2013లో అమెరికా కోర్టు అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటినుంచి ఈ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు.