అమెరికన్ మీడియాకి ట్రంప్ షాక్
అమెరికన్ మీడియాకి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు.
అమెరికన్ మీడియాకి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. వార్తల్లో సరైన ప్రమాణాలు పాటించనందుకు, అసత్య వార్తలను ప్రచురిస్తున్నందుకు ఒక జాబితా తయారుచేసి ఆయా పత్రికలకు ఫేక్ న్యూస్ అవార్డులిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేశారు. ఏబీసీ న్యూస్, సీఎన్‌ఎన్, టైమ్, వాషింగ్టన్ పోస్టు పత్రికలకు తాను ఆ అవార్డులను అందించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
జీఓపీ డాట్‌కామ్ ఈ వార్తను బహిర్గతం చేసిన కొద్ది సేపటికే ఆ వెబ్‌సైట్ క్రాష్ అవ్వడం గమనార్హం. "2017లో ఈ పత్రికలు ద్వంద్వ ప్రమాణాలను పాటించాయి. ముఖ్యంగా ట్రంప్‌కు మీడియా కవరేజీ ఇచ్చే విషయంలో అవి పక్షపాత ధోరణిని ప్రదర్శించాయి. అందుకే వాటికి ఇలాంటి అవార్డులు ఇవ్వడం సబబే" అని ఆ వెబ్‌సైట్ తెలిపింది.
అయితే ట్రంప్ తాను చేసిన ట్వీట్‌లో మరో విషయాన్ని కూడా తెలిపారు. "మీడియా సంస్థలు ఎంత అవినీతిగా వ్యవహరించినా.. అందులో పనిచేసే చాలామంది నిజాయితీపరులైన పాత్రికేయులను చూశాను. వారంటే నాకు గౌరవం ఉంది. వారు రాసే వార్తలు అమెరికన్ సమాజానికే గర్వకారణం" అని కూడా తెలిపారు.