ఉత్తర కొరియా అధ్యక్షుడితో ట్రంప్ భేటీ..?
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యే అవకాశం ఉందని ఇరు దేశాల అధికార ప్రతినిధులు తెలపడం గమనార్హం.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యే అవకాశం ఉందని ఇరు దేశాల అధికార ప్రతినిధులు తెలపడం గమనార్హం. ఉత్తర కొరియా తమ దేశంలో అణుశక్తి ఉత్పత్తికి సంబంధించి అవలంబిస్తున్న పద్ధతులు, అణు పరీక్షలు చేసి తీరుతామని అమెరికాకి సవాలు విసరడం లాంటి అంశాలు కొద్ది నెలలుగా అమెరికాకి ప్రతికూల సంకేతాలు పంపిస్తున్న సంగతి తెలిసిందే.
పరమ శత్రువులుగా జనాల దృష్టిలో పడ్డ ఈ ఇరుదేశాల నేతలు కలిసి ఒకే వేదికను పంచుకుంటారనే వార్తలు రాగానే చాలామంది దీనిని ఓ నకిలీ వార్తగా తేల్చేశారు. అయితే వారు కలిసి మాట్లాడుకొనే అవకాశమైతే కొంతమేరకు ఉందని ఇరు దేశాలూ స్పష్టం చేయడంతో అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నిన్నే దక్షిణా కొరియా జాతీయ భద్రతా వ్యవస్థ సంచాలకులు చుంగ్ యూ యంగ్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే అమెరికా ప్రతినిధులు ఉత్తర కొరియాలోని కొన్ని చోట్లను సందర్శించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు లేకపోయినా.. కిమ్, ట్రంప్‌ను కలిసి మాట్లాడడానికి ఆసక్తితో ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.
ముఖ్యంగా కొరియాలో అణు నిరాయుధీకరణకు ఇరుదేశాల నేతలు గతంలో విభిన్న అభిప్రాయాలు వెలిబుచ్చినప్పటికీ.. ప్రస్తుతం శాంతియుతంగా వ్యవహరించి చర్చలు జరపాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నాయకులు పాల్గొనే శిఖరాగ్ర సమావేశం ఏ ప్రాంతంలో, ఎక్కడ జరుగుతుందన్న విషయంపై ఎలాంటి సమాచారం కూడా అందలేదు. ఈ అంశంపై శ్వేతభవనం అధికారులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది