మీరా మాకు నీతులు చెప్పేది: పాక్‌కు భారత్ కౌంటర్
మానవ హక్కుల గురించి తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని పాకిస్థాన్‌కు గట్టిగా జవాబిచ్చింది భారత్.
జెనీవా: మానవ హక్కుల గురించి తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని పాకిస్థాన్‌కు గట్టిగా జవాబిచ్చింది భారత్. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఓ విఫల రాష్ట్రమని, ఆ దేశం మాకు నీతులు చెప్పాల్సిన పనిలేదని భారత్ తెలిపింది. ఆ సమావేశంలో భారత ప్రతినిధి మినీ దేవి కుమమ్ మాట్లాడారు.
ఐక్యరాజ్యసమితి సమావేశంలో కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ లేవనెత్తింది. దీంతో కశ్మీర్ అంశంపై కౌంటర్‌గా భారత్ మాట్లాడింది. ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఉమర్ లాంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్ ముందుగా తమ దేశం నుంచి ఉగ్రవాదులని తరిమేయాలని భారత్ డిమాండ్ చేసింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నారని, అలాంటి దేశం భారత్‌లో మానవ హక్కులు గురించి మాట్లాడడం శోచనీయమని భారత ప్రతినిధి మినీ దేవి తెలిపారు.
2008లో ముంబై పేలుళ్లకు ప్రధాన సూత్రదారి అయిన హాఫిజ్ సయీద్ లాంటి వాళ్లు పాక్‌లో స్వేచ్చగా తిరుగుతున్నారని, ముందు అలాంటి ఉగ్రవాదులకు శిక్షపడేలా పాక్ చర్యలు ప్రారంభించాలని భారత్ డిమాండ్ చేసింది. విఫల రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఓ దేశం నుంచి ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి పాఠాలు వినాల్సిన అవసరం తమకు లేదన్నారు భారత ప్రతినిధి.