బీజింగ్: వేల కోట్ల ఆస్తులకు అధిపతి కావాలంటే ఎవరికైనా.. ఎన్నేళ్లు పడుతుంది ? వారివారి వ్యాపార సామ్రాజ్యాన్ని, వ్యాపారంలో లాభాలనుబట్టి కొన్నేళ్లు పడుతుందనో లేక ఏకంగా కొన్ని దశాబ్ధాలే పడుతుందనో అనుకుంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లో అది అందరికీ సాధ్యమయ్యే పని కూడా కాదు. కానీ చైనాకు చెందిన ఎరిక్ సేకు మాత్రం అంత సమయం ఏమీ పట్టలేదు. ఆ మాటకొస్తే... ఎరిక్‌కు అసలు కష్టపడాల్సిన అవసరమే లేకుండానే అతడి ఖాతాలో వేల కోట్లు వచ్చిపడ్డాయి. అవును.. అమ్మానాన్న ఇచ్చిన బహుమతితో జస్ట్ 24 ఏళ్ల వయసులోనే సే రాత్రికి రాత్రే ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలోకెక్కడమే కాకుండా ప్రపంచంలోనే 550 మంది అత్యంత సంపన్నుల్లో ఒకడిగా నిలిచాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ ఎవరీ ఎరిక్ సే..
చైనాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ 'సినో బయోఫార్మాసుటికల్స్' అధినేత సే పింగ్‌, చెంగ్ లింగ్ చెంగ్ దంపతుల ముద్దు బిడ్డే ఈ ఎరిక్ సే. పుట్టింది అమెరికాలోని సియాటిల్‌లో అయినా అతడి పాఠశాల చదువులు, కాలేజీ రోజులు బీజింగ్, హాంగ్‌కాంగ్‌లో గడిచిపోయాయి. ఈమధ్యే అమెరికాలోని పెన్సిల్వేనియాలోని వార్టాన్ స్కూల్ ఆఫ్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన ఎరిక్ సే పేరిట అతడి తల్లిదండ్రులు తమ సినో బయోఫార్మాసుటికల్స్ కంపెనీ షేర్లలో ఐదో వంతు వాటాను  బహుమతిగా ఇచ్చారు. ఆ షేర్ల విలువ 3.8 బిలియన్ డాలర్లు. దీంతో ఎరిక్ సే రాత్రికిరాత్రే అపరకుబేరుడైపోయాడు. అంతేకాదు.. ఎరిక్ సే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కన్నా కుబేరుడని ఇంకొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 


అదృష్టం అంటే ఎరిక్‌దే కదా.. అయితే, అలాగని ఆ ఐశ్వర్యం అంతా ఆయనకు ఊరకే రాలేదండోయ్... ధనంతోపాటే అప్పటివరకు తెలియని బాధ్యతలను కూడా మోసుకొచ్చింది. ఎందుకంటే సే తల్లిదండ్రులు అతడికి 5వ వంతు షేర్లను బహుమతిగా ఇవ్వడంతోపాటు కంపెనీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పోస్టులో నియమించి అతడికి కంపెనీ బాధ్యతలు సైతం అప్పగించారు.