కెనడాలోని మిస్సిసియా సిటీలోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి కాలమానం ప్రకారం హురొంటారియో స్ట్రీట్, ఎగ్లింటన్ ఎవెన్యూ ఈస్ట్‌కి సమీపంలోని ముంబై భెల్ రెస్టారెంట్‌లో గురువారం రాత్రి 10.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడులో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులని టొరొంటోలోని ట్రామా సెంటర్‌కి తరలించారు. ఈ ఘటనపై రీజినల్ పారామెడిక్ సర్వీసెస్ అధికార ప్రతినిధి ఒకరు గ్లోబల్ న్యూస్ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. "పేలుడు ధాటికి హోటల్ భవనం దెబ్బ తినలేదు" అని చెప్పారు. రెస్టారెంట్ అద్దాలు ధ్వంసమవడం తప్పితే పెద్దగా ఆస్తి నష్టమేమీ జరగలేదని సదరు అధికార ప్రతినిధి తెలిపారు. భారతీయులు అధికంగా నివసిస్తున్న దేశాల్లో కెనడా కూడా ఒకటి అనే సంగతి తెలిసిందే. అందులోనూ భారతీయులు అధికంగా నివాసం వుంటున్న ప్రాంతంలోని ఇండియన్ రెస్టారెంట్‌లో పేలుడు సంభవించిందనే వార్త భారత్‌లో వుంటున్న వారి సంబంధీకులని కొంత కలవరపాటుకు గురిచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడు వెనుకున్న కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.