గూగుల్, ఫేస్‌బుక్ లాంటి అంతర్జాల దిగ్గజాల వల్ల అప్పుడప్పుడు యూజర్ల ప్రైవసీకి భారీ నష్టం కలిగే అవకాశాలు కూడా పెరుగుతున్నందున ఈ సంస్థలపై యూరోపియన్ యూనియన్ నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. ఈ క్రమంలో యూరోపియన్ యూనియన్ ఆధ్వర్యంలో పనిచేసే జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌(జీడీపీఆర్‌) ఈ సంస్థల డిజిటల్ సెక్యూరిటీ వ్యవస్థ పటిష్టంగా లేదని తేల్చితే పరిస్థితి వేరేగా ఉండబోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే నిజమైతే.. ఆయా దేశాల ప్రభుత్వాలు గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలకు దాదాపు రూ.60 వేల కోట్ల రూపాయలను జరిమానా విధించవచ్చని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రియన్‌ ప్రైవసీ అడ్వకసీ గ్రూప్‌ పలు ఆన్‌‌లైన్ సామాజిక మాధ్యమాల వల్ల యూజర్ల ప్రైవసీకి కలుగుతున్న నష్టం అంతా ఇంతా కాదని తెలిపింది. యూజర్ల అనుమతి లేకుండా వారి జీవితాల్లోకి తొంగిచూసే ఆన్ లైన్ సంస్థలను ప్రోత్సహించవద్దని.. వాటికి భారీ జరిమానాలు విధించాలని స్పష్టం చేసింది.


ముఖ్యంగా ప్రజలకు వారి డేటాకు సంబంధించి సంపూర్ణ హక్కులు ఉండాలని.. వాటిని యూజర్ల ప్రమేయం లేకుండా ఇష్టం వచ్చిన్నట్లు వాడుకొనే ఆన్‌లైన్ సంస్థలను కట్టడి చేయకపోతే ప్రమాదమని ఇప్పటికే అనేక అడ్వకసీ గ్రూపులు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి సంస్థలు కూడా యూజర్ల డేటాని ప్రమాదపుటంచుల్లోకి తీసుకెళ్తున్నాయని పలువురు సైబర్ ప్రైవసీ నిపుణులు అంటున్నారు.


ఈ క్రమంలో ప్రతీ దేశం కూడా సైబర్ ప్రైవసీకి సంబంధించి కొత్త చట్టాలకు రూపకల్పన చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఫ్రాన్స్, బెల్జియం, ఆస్ట్రియా లాంటి దేశాలు ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాయని పలువురు సైబర్ నిపుణులు తెలిపారు. అయితే యూరోపియన్ యూనియన్ తాజాగా తీసుకొచ్చిన రెగ్యులేషన్లకు అనుగుణంగానే ఆ దేశాలలో తమ సంస్థ సేవలు అందిస్తుందని గూగుల్ ప్రతినిధులు తెలిపారు.