2018 నూతన సంవత్సరం వేడుకలని కొంతమంది రెండు, మూడుసార్లు జరుపుకుని వుండి వుంటారేమో కానీ వాళ్లందరికీ నూతన సంవత్సరం ఆరంభమైన క్షణం మాత్రం ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మన జీవితాల్లోకి ప్రవేశించిన 2018 మళ్లీ వెనక్కి వెళ్లడం అనేది అసాధ్యం కనుక. కానీ ఇదిగో ఈ హవాయియన్ ఎయిర్ లైన్స్ విమానంలో డిసెంబర్ 31నాడు ప్రయాణించిన ప్రయాణికులకి మాత్రం 2018 సంవత్సరం నిజంగానే రెండుసార్లు ఆరంభమైంది. అదెలా అంటారా ? అయితే ఇదిగో ఈ ఫ్లైట్ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాలోని సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన హవాయికి రాజధాని అయిన హోనోలోలుకి వెళ్లాల్సిన HAL446 విమానం న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ నుంచి 2018లో టేకాఫ్ అయింది. వాస్తవానికి డిసెంబర్ 31న రాత్రి 11:55 గంటలకి బయల్దేరాల్సిన ఈ విమానం 10 నిమిషాలు ఆలస్యంగా.. అంటే 2018 ప్రవేశించిన తర్వాత 5 నిమిషాలకు నింగిలోకి ఎగిరింది. దీంతో విమానంలో వున్న ప్రయాణికులు ఆక్లాండ్ లోనే 2018 ఆరంభాన్ని చూశారన్నమాట. ఆ తర్వాత ప్రపంచాన్ని చుట్టొచ్చిన విమానం హొనోలోలులో ల్యాండ్ అయ్యేటప్పటికీ సమయం డిసెంబర్ 31న ఉదయం 10:16 అయింది. 


సైన్స్ ప్రకారం భూభ్రమణం ఆధారంగా ప్రపంచంలో ఒకేసారి వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు కాలమానాలు వుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. అలా న్యూజీలాండ్ కాలమానం ప్రకారం 2018 ప్రవేశించిన 5 నిమిషాల తర్వాత నింగిలోకి ఎగిరిన విమానం సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత డిసెంబర్ 31వ తేదీన ఉదయం 10:16 గంటలకి హవాయిలోని హొనోలోలులో దిగింది. హవాయిలో విమానం దిగిన ప్రయాణికులు మరోసారి 2018 ఆరంభాన్ని జరుపుకోవడం విశేషం. ఈ రెండు ప్రాంతాల మధ్య 23 గంటల వ్యత్యాసం వుండటమే అందుకు కారణమైంది.