Pakistan Food Crisis: పాపం పాకిస్థాన్‌లో తీవ్ర సంక్షోభం నెలకొని ఉంది. పాలకుల తప్పుడు నిర్ణయాలు, నిర్లక్ష్యం వల్ల దేశం నానాటికి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటోంది. పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ముదిరి ఆహార సంక్షోభం వైపు వెళ్తోంది. డిమాండ్ కి తగినంత సరఫరా లేకపోవడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పాకిస్థాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్ లో 10 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ రూ. 1500 పలుకుతుండగా.. 20 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ 2800 రూపాయల వరకు అమ్ముడవుతోంది. పాకిస్థాన్ లో ప్రధానమైన ఆహార పదార్థం రోటీ కావడంతో అందుకు అవసరమైన ముడి సరుకు గోధుమ పిండి ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతున్నాయి. కరాచి, పెషావర్ లోనూ ఇంచుమించు ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే రేషన్‌పై ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకుల కోసం జనం ఎగబడుతున్నారు. పాకిస్థాన్ లో గోధుమ పిండి సరఫరా చేస్తోన్న వ్యాన్ వద్ద గోధుమ పిండి కోసం జనం ఒకరినొకరు తోసుకుంటున్న తీరు చూస్తే అక్కడి ధీన పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో క్లిప్పింగ్ అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.


పాకిస్థాన్‌లో గోధుమ పిండి కోసం జరిగిన తోపులాటలో జనం ఒకరినొకరు తోసుకోవడం అందులో ఒకరిద్దరు ఆ పక్కనే ఉన్న మురికి కాల్వలో పడిపోవడం వంటి దృశ్యాలు ఉన్న వీడియోను ఒక ట్విటర్ యూజర్ ట్విటర్ లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే, ఈ వీడియో నిజంగా పాకిస్థాన్ కి చెందినదే లేక మరెక్కడిదైనానా అనే విషయంలో ప్రస్తుతం క్లారిటీ కొరవడింది. జీ మీడియా సైతం ఈ వీడియో ఎక్కడిది, ఏంటి అనే వివరాలను ధృవీకరించడం లేదు. కాకపోతే ప్రస్తుతం పాకిస్థాన్ లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్న మాట మాత్రం వాస్తవం. అది ఆహార సంక్షోభానికి దారితీస్తోందని పాకిస్థాన్ మీడియా వార్తా కథనాలే స్పష్టంచేస్తున్నాయనే విషయం గమనార్హం.