జాగింగ్ చేస్తూ దేశ సరిహద్దులనే దాటింది
బీచ్‌లో జాగింగ్ చేస్తూ ఓ యువతి ఏకంగా దేశ సరిహద్దునే దాటి వెళ్లింది.
బీచ్‌లో జాగింగ్ చేస్తూ ఓ యువతి ఏకంగా దేశ సరిహద్దునే దాటి వెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లికి వెళితే.. మే 21న ఫ్రాన్స్‌కు చెందిన సిండెల్లా రోమన్(19) తన తల్లిని కలుసుకొనేందుకు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం వైట్‌రాక్ ప్రాంతానికి వెళ్లింది. ఉదయాన్నే వ్యాయామం చేసే అలవాటున్న ఆమె పొరపాటున కెనడా-అమెరికా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించింది. ఆమె వద్ద గుర్తింపు పత్రాలు లేకపోవడంతో.. అక్రమంగా తమ దేశంలో ప్రవేశించిన కారణంగా అమెరికా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమె తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె వెంటనే పాస్‌పోర్టు, ఇతర గుర్తింపు పత్రాలను తీసుకొచ్చి అధికారులకు చూపించినా.. వాటిపై కెనడా అధికారుల ధృవీకరణ లేదని చెప్పి.. రోమన్‌ను రెండు వారాల పాటు నిర్భధంలో ఉంచారు. అవసరమైన పత్రాలను అందజేశాక జూన్ 6న రోమన్‌ను విడిచిపెట్టారని కెనడా మీడియా వర్గాలు తెలిపాయి.