శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్ కార్యాలయాల్లో గురువారం వందల సంఖ్యలో సిబ్బంది, కాంట్రాక్టర్లు కార్యాలయాల నుంచి పనిమధ్యలోనే వాకౌట్ చేసి సంస్థపై తమ నిరసన తెలిపారు. పనిచేసే చోట జాత్యహంకారం, అసమానతలు, మహిళలపై వేధింపులు వంటివి ఎక్కువయ్యాయనే ఫిర్యాదుల నేపథ్యంలో సిబ్బంది భారీ సంఖ్యలో పని మధ్యలోనే వాకౌట్ చేయడం చర్చనియాంశమైంది. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరు సిబ్బంది తరపున ప్రతినిధిని నియమించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పనిచేసే చోట జరుగుతున్న వేధింపులపై మానవ వనరుల (హ్యూమన్ రిసోర్స్) విభాగం సత్వర చర్యలు తీసుకునేలా కొత్త పాలసీ తీసుకురావాలని ఆందోళనకారులు తమ డిమాండ్లలో పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇకనైనా సంస్థలో ఇప్పటివరకు నమోదైన లైంగిక వేధింపుల ఫిర్యాదుల గణాంకాలను బహిర్గతం చేయడంతోపాటు లైంగిక వేధింపుల వ్యవహారాల్లో బలవంతపు సెటిల్మెంట్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఈ సందర్భంగా సిబ్బంది డిమాండ్ చేశారు.


జీ న్యూస్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చయ్ ఓ ప్రకటనలో స్పందిస్తూ.. సిబ్బంది నిర్మాణాత్మకమైన సూచనలే చేశారని, సిబ్బంది లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్న సంస్థ వాటిని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ఆల్ఫాబెట్ సంస్థలో పనిచేస్తోన్న 94,000 మంది సిబ్బంది, ఇంకా వేలాది మంది కాంట్రాక్టర్లు తలపెట్టిన ఈ ఆందోళన సంస్థ షేర్ మార్కెట్‌పై ఏ మాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది. అయితే, తమ సమస్యల పరిష్కారం దిశగా కంపెనీ దృష్టి సారించకపోయినట్టయితే, భవిష్యత్‌లో నియామకాలపై తమ ఆందోళనల ప్రభావం కచ్చితంగా ఉంటుందని సిబ్బంది భావిస్తున్నారు. 


ఇటీవల న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురించిన ఓ కథనమే సిబ్బందిలో రగులుతున్న ఆగ్రహావేశాలకు మరింత ఊపిరి పోసినట్టు తెలుస్తోంది. 2 దశాబ్ధాల క్రితం స్థాపించిన గూగుల్ అంటే ప్రపంచంలో ఎవరికైనా ఓ పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా పనిచేసే చోట సిబ్బందికి అందించే సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఆ సంస్థను వరల్డ్ నెంబర్ 1 గా తీర్చిదిద్దాయి. అయితే, అటువంటి గూగుల్ సంస్థపైన ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది అసంతృప్తితో రగిలిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.