మోదీపై చాలా గౌరవం ఉంది.. త్వరలోనే ఆయనతో మాట్లాడుతా : డొనాల్డ్ ట్రంప్
మోదీపై చాలా గౌరవం ఉంది.. త్వరలోనే అతడితో మాట్లాడుతా : డొనాల్డ్ ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఎంతో గౌరవం ఉందని, త్వరలోనే అతడితో మాట్లాడాలనుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. మంగళవారం శ్వేత భవనంలో జరిగిన దీపావళి వేడుకల్లో భారతీయులతో కలిసి పాల్గొన్న సందర్భంగా అక్కడి భారత రాయబారి నవ్‌తేజ్ సింగ్‌తో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలకు భారత రాయబారి మర్యాదపూర్వకంగా స్పందిస్తూ.. మోదీ సైతం మిమ్మల్ని కలవాలని భావిస్తున్నారు అని అన్నారు. నవంబర్ 30, డిసెంబర్ 1న అర్జెంటీనాలో జరిగే G-20 సదస్సులో నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ కలుసుకోనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సదస్సు గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాకుండా త్వరలోనే మోదీతో మాట్లాడుతానని ట్రంప్ చెప్పడం గమనార్హం.
డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ గురించి చెబుతూ.. మోదీ స్వపరిపాలన అందిస్తున్నారని కొనియాడిన సందర్భాలున్నాయి. అంతేకాకుండా గతేడాది జూన్ లో ట్రంప్ ఆహ్వానం మేరకు శ్వేత భవనంలో కాలుపెట్టిన మోదీకి అక్కడ ట్రంప్ నుంచి ఘన స్వాగతం లభించింది.