అగ్నిపర్వతం బద్దలు.. 69కి చేరిన మృతులు
మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలోని ఫ్యూగో అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో మృతుల సంఖ్య 69కి చేరింది.
మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలోని ఫ్యూగో అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో మృతుల సంఖ్య 69కి చేరింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టి.. శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటివరకు 69 మంది మృతిచెందగా.. మరో 300 మందికి పైగా గాయపడ్డారని గ్వాటెమాలా అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇప్పటివరకు 13 మంది మృతదేహాలను గుర్తించినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సు ప్రతినిధి మిర్న జెలడాన్ పేర్కొన్నారు.
మధ్య అమెరికాలోని అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన ఫ్యూగో అగ్నిపర్వతం బద్దలై ఎత్తున లావా వెదచిమ్ముతోంది. అగ్నిపర్వతం బద్దలైన సమయంలో దాని చుట్టుపక్క ప్రాంతాల్లో కొందరు పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు. వారంతా లావాలో చిక్కుకుని ప్రాణాలు విడిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఫ్యూగో నుంచి వెలువడిన లావా దాదాపు 8 కి.మీ. నదిలా మారి వేగంగా ప్రవహించింది. ఈ క్రమంలో సమీప గ్రామాల్లోని ఇళ్లకు మంటలు వ్యాపించి కొందరు సజీవదహనమయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.
సమాచారమందుకున్న రెస్క్యూ టీం ప్రమాద స్థలికి వెళ్లి అగ్నిపర్వత పరిసర ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 'ఫ్యూగో బద్దలై ఆదివారం బద్దలైంది. రెండు రోజులు అవుతున్నా ఇంకా లావా అత్యధిక ఉష్ణోగ్రతతో ఉంది' అని అధికారులు చెబుతున్నారు.