పాకిస్థాన్‌కి ఇకపై ఇవ్వనున్న ఆర్ధిక సహాయాన్ని ఆపేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం వెనుక భారత్ హస్తం వుందని ఆరోపించాడు జమాత్-ఉద్ దావ (జేయుడీ) అధినేత, ముంబై దాడుల సూత్రదారి హఫీజ్ సయీద్. భారత్ లేనిపోని ఆరోపణలతో అమెరికాని నమ్మించి అమెరికా నుంచి పాకిస్థాన్‌కి అందాల్సిన ఆర్థిక సహాయం నిలిపివేసేలా ప్రభావితం చేసిందని హఫీజ్ సయీద్ విమర్శలు గుప్పించాడు. ఓవైపు పాకిస్థాన్‌కి అమెరికా ఆర్థిక సహాయం నిలిపేస్తున్నట్టు ప్రకటించగా మరోవైపు జేయుడీ సంస్థకు ఎటువంటి చందాలు అందించరాదని సెక్యురిటీస్ అండ్ స్టాక్ ఎక్చేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (సెక్ప్) ప్రకటించింది. నిషేదిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయిన జుయుడీ చందాల రూపంలో నిధులు సమీకరించడంపై నిషేధం విధిస్తున్నట్టు సెక్ప్ తన తాజా ప్రకటనలో స్పష్టంచేసింది. దీంతో ఈ మొత్తానికి భారత్ చేసిన కుట్రలే కారణం అంటూ భారత్‌పై విమర్శలు ఎక్కుపెట్టాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉగ్రవాదుల విషయంలో పాకిస్థాన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆవేదనను నిన్న ట్విటర్ ద్వారా వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాకిస్థాన్‌కి అమెరికా 33 బిలియన్ డాలర్లకుపైగా ఆర్ధిక సహాయాన్ని అందించింది. అందుకు బదులుగా అమెరికాకు ఏమీ చేయని పాకిస్థాన్... పైగా అమెరికా నాశనం కోరుకుంటున్న ఉగ్రవాదులకి ఆశ్రయం కల్పించి వారికి రక్షణ కల్పిస్తోందని పాక్‌పై నిప్పులు చెరిగారు. అందుకే పాకిస్థాన్‌కి ఇంకా చేయాల్సి వున్న 255 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టంచేశారు. 


డొనాల్డ్ ట్రంప్ విమర్శలపై స్పందించిన పాక్.. ఉగ్రవాదం విషయంలో పాక్ అవలంభిస్తున్న వైఖరిపై తగిన సమయంలో తగిన విధంగా స్పందిస్తామని అభిప్రాయపడింది.