హవాయి దీవుల చరిత్రలో భారీ భూకంపం
పసిఫిక్ మహాసముద్రంలోని హవాయి దీవుల్లో చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్రతతో రిక్టర్ స్కేలుపై 7.4గా భూకంపం సంభవించింది.
హవాయి: పసిఫిక్ మహా సముద్రంలోని హవాయి దీవుల్లో చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్రతతో రిక్టర్ స్కేలుపై 7.4గా భూకంపం సంభవించింది. దీవిలోని అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతంగా పేరున్న కిలౌయి బద్దలై భారీ ఎత్తున లావాను వెదజల్లుతోంది. గడచిన 40 సంవత్సరాల్లో ఏర్పడిన భూకంపాల్లో ఇదే అతిపెద్దదని, అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
కాగా, శుక్రవారం హవాయి దీవుల్లో 5.6, 6.9 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. దీంతో ద్వీప ప్రజలు వణికిపోగా.. తాజా భూకంపంతో మరింతగా భయపడ్డారు. మరోవైపు కిలౌయీ ప్రాంతంలో 1,700 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు, మరింత మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. అగ్నిపర్వతం కారణంగా పెద్దఎత్తున సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతుండగా, ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపడుతోంది.
స్వల్పస్థాయి భూకంపాలను కలుపుకుని గత వారం రోజుల్లో హవాయిలో 1000కి పైగా సంభవించాయి. ద్వీపాల్లో అతి భారీ భూకంపాలు సంభవించినప్పుడు సునామీ సంభవించడం సహజం. కానీ, హవాయికి ఆ ముప్పు లేదని సునామీ నిపుణులు చెబుతున్నారు.