పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేత షహబాజ్ షరీఫ్ ఈ రోజు తన ఓటర్లను ఆకట్టుకోవడానికి పలకాల్సిన ప్రగల్భాలు, చేయాల్సిన వాగ్దానాలు అన్నీ కూడా చేశారు. పాకిస్తాన్ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేయడానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ..తాను కాశ్మీరును ఎట్టిపరిస్థితిలోనైనా పాకిస్తాన్‌లో పూర్తిగా విలీనం చేయడానికే ప్రయత్నిస్తానని తెలిపారు. గతంలో ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ ఎలా విలీనం అయ్యాయో.. కాశ్మీర్ కూడా పాకిస్తా్న్‌లో విలీనం అయితే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని తెలిపారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ తరఫున ప్రధాని పదవికి పోటీ పడుతున్న షహబాజ్ షరీఫ్ ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాటలు అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశంలో కాశ్మీరీలు నరకయాతన పడుతున్నారని.. శాంతి పరిరక్షణ కోసం వారి భూభాగాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేయాల్సిన అవసరం ఉందని షహబాజ్ తెలిపారు. చూస్తుంటే నా పోరాటం బెర్లిన్ గోడను లాగే పోరాటంలా ఎవరికైనా కనిపిస్తుందని.. కానీ తాను గనుక ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కాశ్మీరును పాకిస్తాన్‌లో విలీనం చేయలేకపోతే పేరు మార్చుకుంటానని షహబాజ్ అన్నారు.


65 ఏళ్ల షహబాజ్ మాట్లాడుతూ భారతీయులందరూ పాకిస్తాన్ సరిహద్దు వద్దకు వచ్చి ఆ దేశాన్ని "మాస్టర్" అని సంబోధించే రోజు వస్తుందని షహబాజ్ తెలిపారు. వీలైతే తాను మలేషియా ప్రధానిని, టర్కీ ప్రధానిని కలిసి పాకిస్తాన్‌ను గొప్ప దేశంగా ఎలా తీర్చిదిద్దాలన్న విషయంపై పాఠాలు నేర్చుకుంటానని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ లాంటి నాయకులకు పాకిస్తానీయులు ఓటు వేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదని..వారు చేతకాని ప్రమాణాలు చేస్తారని షహబాజ్ విమర్శించారు.


గతంలో షహబాజ్ పాకిస్తా‌న్‌లోని పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌‌కి సోదరుడైన షహబాజ్ షరీఫ్ పై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే నవాజ్ షరీఫ్ పలు అవినీతి కేసులలో భాగంగా జైలుకి, తన కుమార్తెతో సహా వెళ్లిన సంగతి తెలిసిందే.