ఉత్తర కొరియా తాజాగా ప్రయోగించిన క్షిపణి పరీక్షతో ప్రస్తుతం కొరియన్ దీవుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్షిపణి ప్రయోగంపై స్పందించిన అమెరికా.. ఇటువంటి చర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధిచెబుతామనే రీతిలో  వందలాది జెట్ విమానాలతో  డ్రిల్ నిర్వహించింది. లక్షల కోట్ల డాలర్లతో అభివృద్ధి చేసిన  ఎఫ్‌ -35 ని డ్రిల్‌లో ప్రదర్శించింది. ఈ విన్యాసాల్లో ఎఫ్ -22 రాపర్ స్టీల్త్ యుద్ధవిమానాలు కూడా పాల్గొన్నాయి. కొరియన్ ద్వీపకల్పంలో నాలుగు రోజుల పాటు ఈ డ్రిల్ నిర్వహించనుంది . ఈ పరిస్థితుల నడుమ అమెరికా, కొరియా దేశాలు ఎవరికి వారూ ససేమిరా అంటూ పరస్పరం మాటల యుద్ధం కొనసాగిస్తున్నాయి. ఎవ్వరూ వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


గత కొంత కాలం నుంచి ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణులు ప్రయోగిసున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశానికి అమెరికా పలుమార్లు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మరో సారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా తాజా క్షిపణి ప్రయోగించి కయ్యానికి కాలుదువ్వింది. దీనికి చెక్ పెట్టేందుకు అమెరికా చేస్తోన్న సైనిక విన్యాసాలు ఆందోళ‌న రేపే విధంగా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.