Indonesian flight feared crashed in sea | జ‌కర్తా: ఇండోనేషియాలో శ్రీవిజ‌య సంస్థ‌కు చెందిన ప్యాసింజ‌ర్ ఫ్లైట్ జకర్తా నుండి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల వ్యవధిలోనే అదృశ్యమవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇండోనేషియా రాజ‌ధాని జ‌క‌ర్తా నుంచి బోర్నియో ఐలాండ్‌లోని పొంటియనక్ బ‌య‌ల్దేరిన SJ182 నెంబ‌ర్‌ గ‌ల బోయింగ్-737-500 విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో ( ATC ) సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఇండోనేషియా అధికారయంత్రాంగం గల్లంతైన విమానం ఆచూకీ కోసం జకార్తాకు ఉత్తరాన ఉన్న సముద్ర జలాల్లో గాలింపు చేపట్టింది. అదృశ్య‌మైన విమానంలో 56 మంది ప్ర‌యాణికులు, ఆరుగురు సిబ్బంది క‌లిపి మొత్తం 62 మంది ఉన్నార‌ు. ప్రయాణికులలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండోనేషియా స్థానిక కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 2.40 గంట‌ల‌కు బోయింగ్ -737 విమానంతో రాడార్‌కు సంబంధాలు తెగిపోయాయి. విమానం ఆచూకీ గల్లంతవడానికి ముందుగా అత్యధికంగా 10,900 అడుగుల ఎత్తులో ఎగిరిన విమానం.. చివరిగా 250 అడుగుల ఎత్తులోకి జారిందని, ఆ తర్వాతే విమానం ( Indonesian Boing flight ) ఏటీసీతో సంబంధాలు కోల్పోయిందని ఇండోనేషియా సర్కార్ పేర్కొంది.


ఇదిలావుంటే, అదృశ్యమైన విమానం ఆచూకీ కోసం అన్వేషణ ప్రారంభించిన రెస్క్యూ టీమ్‌కి ఇండోనేషియా సముద్ర జలాల్లో విమానం శకలాలు గుర్తించినట్టు వెల్లడించింది. కాకపోతే ఆ విమానం శకలాలు ఆచూకీ గల్లంతయిన విమానానికి చెందినవేనా కాదా అనే విషయంలోనే స్పష్టత కొరవడింది. సముంద్రంపై 90 నిమిషాల పాటు ప్రయాణం చేయాల్సి ఉండగా.. గాల్లోకి టేకాఫ్ అయిన 4 నిమిషాల వ్యవధిలోనే ఏటీసీతో సంబంధాలు తెగిపోవడంతో విమానం ( Sriwijaya Air flight ) ఏదైనా ప్రమాదానికి గురై ఉంటుందేమోననే ఆందోళన కలుగుతోంది.