ట్రంప్ కూతురుకి ఫలక్‌నామాలో ఆతిథ్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె మరియు శ్వేతభవనం సలహాదారు ఇవాంకా ట్రంప్ ఈ నెల 28,29వ తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమెకు తాజ్ ఫలక్‌నామాలో విందును ఏర్పాటు చేయనున్నారు.
ఈ క్రమంలో సెక్యూరిటీ బలగాలను అప్రమత్తం చేస్తూ, ఫలక్‌నామా ప్యాలెస్‌కు దగ్గరలో ఉన్న మార్గాలన్నింటిలోనూ హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్ ప్రాంతాలలో పోలీసు బలగాలను భారీగా మోహరించనున్నట్లు సమాచారం.
"గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమ్మిట్"లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న ఇవాంకా పర్యటన ముగిసేవరకు మాదాపూర్ రహేజా మైండ్ స్పేస్‌లోని వెస్టిన్ హోటల్లో బస చేయనున్నారు. ఈ పర్యటన జరిగేంతవరకు ఇవాంకాకి ప్రత్యేక సెక్యూరిటీ అందించడానికి దాదాపు 500 పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
ఇటీవలే భారత్‌కు చెందిన పలువురు ఇంటెలిజెన్స్ అధికారులు, అమెరికన్ రక్షణ అధికారులతో కలిసి ఫలక్‌నామాను సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇవాంకాకి ప్రత్యేక భద్రత ఇవ్వడం కోసం ఆక్టోపస్ సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా రంగంలోకి దిగనున్నారు.
అలాగే ఆర్మీ రిజర్వుడు పోలీసులు, గ్రేహౌండ్ సిబ్బంది కూడా ప్రత్యేక విధులు నిర్వహించనున్నారు. ఇవాంకా హైదరాబాద్ వస్తున్న క్రమంలో.. ఇప్పటికే ఆ నగర పరిసర ప్రాంతాల్లో రోడ్డులను బాగుచేయిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.