Japan Earthquake Updates: జపాన్ భూకంపంలో 57కు చేరిన మరణాలు, ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు వైరల్
Japan Earthquake Updates: కొత్త ఏడాది తొలిరోజే ప్రకృతి ప్రకోపించడంతో జపాన్ విలవిల్లాడింది. తీవ్ర భూకంపం, సునామీ కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వెలుగు చూస్తున్న భూకంపం వీడియోలు భయపెడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Japan Earthquake Updates: జనవరి 1, 2024 ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్ల మునిగి ఉంటే ప్రకృతి మాత్రం జపాన్ దేశంపై పగబట్టింది. భారీ భూకంపం చోటుచేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు..ఇప్పటి వరకూ ఏకంగా 155 సార్లు భూమి కంపించింది. సునామీ తోడు కావడంతో బీభత్సం పెరిగింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
జపాన్ పశ్చిమ తీర ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంతో ఆ దేశం విలవిల్లాడింది. రిక్టర్ స్కేలుపై జనవరి 1వ తేదీన అత్యధికంగా 7.6 తీవ్రత నమోదైంది. అప్పట్నించి ఇప్పటి వరకూ జపాన్ దేశంలో భూమి 155 సార్లు కంపించింది. ప్రారంభంలో ప్రాణ, ఆస్థి నష్టంపై పెద్దగా సమాచారం అందలేదు. కానీ అటు ఆస్థినష్టం ఇటు ప్రాణనష్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 57 మంది మరణించినట్టు తెలుస్తోంది. వందలాది భవనాలు నేలకూలాయి. భూకంపానికి సునామీ అలలు తోడవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఇషికావా ప్రీఫెక్చర్‌లోని పలు నగరాల్లో సునామీ కెరటాల్ని గుర్తించారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాజిమా ప్రాంతంలో 1.2 మీటర్లు, కనజావా ప్రాంతంలో 1 మీటర్ ఎత్తులో అలలు ఎగసిపడ్డాయి. సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి.
మరోవైపు భూకంపం కారణంగా కొన్ని వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. భూకంపం, సునామీకారణంగా జపాన్‌లో 40 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. నీటి సరఫరా పైపులైన్లు దెబ్బతిన్నాయి. బుల్లెట్ రైలు సేవలు ఆగిపోయాయి. మొబైల్ నెట్‌వర్క్ నిలిచిపోయింది.
జపాన్ దేశంలో ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలు ఎత్తివేశారు. అయితే సముద్రపు అలల్లో మార్పు వచ్చేందుకు ఇంకా అవకాశముందంటున్నారు. భూకంప బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాజిమా నగరంలో ఎక్కువమంది మరణించినట్టు తెలుస్తోంది. శిధిలాలు తొలగించే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో రోడ్లు భారీగా చీలిపోవడం లేదా కృంగిపోవడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది.
Also read: Japan Earthquake Scary Videos: జపాన్‌లో భారీ భూకంపం, భయపెడుతున్న వీడియోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook