జపాన్‌ దేశాన్ని భారీ తుపాన్ అతలాకుతలం  చేసింది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంతగా టైఫూన్ జేబీ  విరుచుకుపడటంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వందమందికి పైగా గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పౌరుల్ని కాపాడేందుకు అధికార యంత్రాంగం సత్వర చర్యలు చేపట్టాలని ప్రధాని షింజో అబె ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళవారం జపాన్‌ పశ్చిమ ప్రాంతాన్ని జేబీ తుఫాను అతలాకుతలం చేసింది. కుండపోత వర్షాలకు తోడు గంటకు 210కి.మీల వేగంతో వీచిన ప్రచండ గాలులకు వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ తుఫాను ధాటికి ఇళ్లు, వంతెనలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అనేక చోట్ల విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.


టైఫూన్ జేబీ ధాటికి.. ఒసాకా ప్రాంతంలోని బ్రిడ్జి ధ్వంసం కావడం, కన్‌సాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు వచ్చి చేరడంతో పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దాదాపు 700 విమానాలను రద్దు చేశారు. తుఫాను జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిందని అధికారులు తెలిపారు. కాగా.. 1993లో జపాన్‌ను  భారీ తుపాన్‌ కుదిపేసింది. ఆ తరువాత ఇదే అతిపెద్ద తుఫాన్ అని అధికారులు తెలిపారు.