20 సంవత్సరాల బ్రిటీష్ గ్లామర్ మోడల్ క్లాయ్ అయిలింగ్‌ను కొందరు సెక్స్ మాఫియా నిర్వాహకులు ఆన్‌లైన్‌లో  లైంగిక బానిసగా మార్చి అమ్మేయాలని ప్రయత్నించారన్నది పలు విదేశీ పత్రికల ద్వారా అందిన సమాచారం. తొలుత ఓ మోడల్ కంపెనీ ఏజెన్సీగా పరిచయం చేసుకున్న ఈ మాఫియా నిర్వాహకులు, అయిలింగ్‌ను నమ్మించి ఫోటో షూట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫోటో షూట్ కోసం తమ వద్దకు వచ్చిన ఆమెను మాటల్లో దించి, ఆ తర్వాత ఒక్కసారిగా దాడిచేసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె నిద్రలోకి జారుకున్నాక...  ఒక పెద్ద సూట్ కేసులో కుక్కి.. నార్త్ ఇటలీకి దగ్గరలో ఉన్న ఓ నిర్మానుష్యమైన దీవికి కారులో తీసుకెళ్లారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కడే అయిలింగ్‌ను సెక్స్ బానిసగా మార్చి బ్లాక్ డెత్ గ్రూప్ అనే మాఫియా సంస్థకి అమ్మేస్తున్నామని ఆమెకు తెలిపారు. అనుకోని ఈ సంఘటనలకు అయిలింగ్ హతాశురాలైంది. దాదాపు రూ.20 కోట్ల రూపాయలకు (£230,000) ఆమెను బేరం పెట్టినట్లు సమాచారం. అయితే ఆమెకు పెళ్ళయిందని.. ఓ బిడ్డ కూడా ఉందని తెలుసుకున్న ఆ మాఫియా నిర్వాహకులు ఆశ్చర్యపోయారట.


పెళ్ళయిన అమ్మాయిలను కిడ్నాప్ చేయడం తమ నిబంధనలకు విరుద్ధం అని భావించి అయిలింగ్‌ను కొన్ని షరతుల మీద విడిచిపెట్టారట. 50,0000 డాలర్లను సిద్ధం చేసుకోమని.. ఓ వారంలోగా ఆ డబ్బును బిట్ కాయిన్స్ రూపంలో చెల్లించమని.. లేకపోతే హత్యకు గురికావాల్సి ఉంటుందని బెదిరించి ఆమెను విడిచిపెట్టారు. అయితే ఆమె ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఈ పథకానికి కీలక సూత్రధారిగా భావిస్తున్నటు వంటి 30 ఏళ్ళ లుకస్ హెర్బా అని యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ పథకం వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందని.. ఈ మధ్యకాలంలో యూరప్‌లో ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలు కిడ్నాప్‌కి గురవుతున్న సందర్భంలో.. ఈ కేసుని చాలా ఛాలెంజింగ్‌గా తీసుకొని విచారణ చేపడతాం అంటున్నారు పోలీసులు.