పాకిస్తాన్‌లో గూఢచర్యం ఆరోపణలతో మరణశిక్ష విధించబడిన భారత పౌరుడు కులభూషణ్ జాదవ్‌‌ని ఆయన కుటుంబం కలవడానికి ఇటీవలే పాక్ ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ కుటుంబం పట్ల పాకిస్తాన్ అధికారులు వ్యవహరించిన తీరు అమానవీయమైన, అమానుషమైన రీతిలో ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. కుమారుడిని కలవడానికి వెళ్లిన జాదవ్ తల్లి చేత చీర విప్పించి.. సల్వార్, కుర్తా వేసుకోమని పాక్ అధికారులు కోరారని ఆమె తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే కుంకుమ, గాజులు పెట్టుకోవద్దు అని చెప్పారని.. ఆఖరికి కొడుకుని కలవడానికి వెళ్లే ముందు మంగళసూత్రం కూడా తీయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ రోజు సుష్మా స్వరాజ్ రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు.  జాదవ్‌ని కలవడానికి వెళ్లిన అతని తల్లి, భార్యను క్షుణ్నంగా తనిఖీ చేశారు. అలాగే మరాఠీలో మాట్లాడాలనుకొనే జాదవ్ తల్లిని పాక్ అధికారులు అనుమతించలేదు. అలాగే మాట్లాడుతున్నప్పుడు ఇంటర్ కామ్ ఆపేశారు.


హిడెన్ కెమెరా లేదా చిప్ గానీ ఉండే అవకాశం ఉందని భావించి, జాదవ్ భార్య చెప్పులు కూడా తీయించి లోపలికి అనుమతించారు. జాదవ్ కుటుంబం పట్ల పాకిస్తాన్ ఇంత అమానుషంగా ప్రవర్తిస్తుందని తాను అనుకోలేదని సుష్మా స్వరాజ్ ప్రకటనలో తెలిపారు.