నైజీరియాను లస్సా ఫీవర్ వణికిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి నైజీరియాలో 142 మంది ప్రాణాలు వదిలారు. 2018 ప్రారంభం నుంచి ఇప్పటివరకు 142 మందిని లస్సా ఫీవర్ బలికొన్నట్టు నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) అధికారికంగా ప్రకటించింది. నైజీరియాలోని 36 రాష్ర్టాలకుగాను 20 రాష్ర్టాల్లో లస్సా ఫీవర్ విజృంభిస్తోంది. 18 రాష్ర్టాల్లో మార్చి 6వ తేదీ వరకే 110 కేసులు నమోదయ్యాయి. నైజీరియాలో దక్షిణాది రాష్ర్టాలైన ఇడో, ఒండో, ఎబొనియి రాష్ర్టాల్లో లస్సా ఫీవర్ ప్రభావం అధికంగా ఉన్నట్టు మార్చి 6వ తేదీ వరకే స్పష్టంచేసింది. లస్సా ఫీవర్ జబ్బు లక్షణాలు సైతం ప్రమాదకరమైన మర్బర్గ్, ఎబోలా వైరస్ తరహాలోనే వుంటాయని, వాంతులు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఎన్‌సీడీసీ నిపుణుల బృందం అక్కడి పౌరులని అప్రమత్తం చేసింది. 


2014లో పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్‌లో ఆఖరిసారిగా వెలుగుచూసిన ఈ లస్సా ఫీవర్ ఆ తర్వాత మళ్లీ ఇలా నైజీరియిలోనే భారీ స్థాయిలో విరుచుకుపడుతోంది. ఎలుకల మల, మూత్ర విసర్జనాలు అంటుకుని ఉన్న పాత్రల్లోని ఆహారం తీసుకోవడం ద్వారా ఈ లస్సా వైరస్ సోకే ప్రమాదం వుందని ఎన్‌సీడీసీ నిపుణులు తెలిపారు. ఒకరు వాడిన సిరంజిలను మరొకరు ఉపయోగించడం ద్వారా కూడా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఉత్తరనైజీరియాలోని లస్సా అనే పట్టణంలో  1969లో మొదటిసారిగా ఈ వ్యాధి లక్షణాలతో ఓ కేసు నమోదైంది. ఆ కారణంగానే ఈ వ్యాధిని నైజీరియన్స్ లస్సాఫీవర్‌గా పిలుస్తున్నారు.