ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు లెక్కకు మించి జరుగుతున్నాయి. కానీ ఈ విమాన ప్రమాదం అలాంటి ఇలాంటిది కాదు.. 181 ప్రాణాలను పణంగా పెట్టిన ఘోర ప్రమాదం. అందులో 23 ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. ఇండోనేషియాలోని లయన్ విమానయాన సంస్థకు చెందిన 'జేటీ 610' విమానం సోమవారం (అక్టోబరు 29) ఉదయం బయలుదేరిన కొద్ది సేపటికే కుప్పకూలింది. ఈ విమానంలో 181 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలెట్లు,  అయిదుగురు సిబ్బంది కూడా ఉన్నారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోవడమే ఈ విమాన ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత కానరాకుండా పోయిన ఈ విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లు  ఇండోనేషియా మీడియా ఇప్పటికే వెల్లడించింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు విమానం కోసం గాలింపులు జరిపారు. విమాన శకలాలు పలు చోట్ల పడినట్లు తమకు సమాచారం అందిందని కూడా తెలిపారు. కాకపోతే..  విమానంలో ఉన్న ప్రయాణికుల సంగతి తమకు తెలియదని.. వారిని కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నామని ఇండోనేషియా డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు తెలిపారు. 


ఉదయం 6.20 గంటల సమయంలో ఇండోనేషియా రాజధాని జకర్తాలోని టాంగేరాంగ్ ఎయిర్ పోర్ట్ నుంచి పంగ్‌కల్ పినాంగ్‌కు బయలుదేరిన ఈ విమానం.. 7.30 గంటలకు గమ్యస్థానం చేరుకోవాలి. కాకపోతే అంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 20 మంది ఇండోనేషియా అధికారులు కూడా ఉన్నట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది. ఈ బోయింగ్ 737 మాక్స్ 8 మోడల్ విమానం తయారుచేసి కేవలం 2 నెలలే అయ్యిందని  అధికారులు తెలిపారు.