మాల్యాకు ఊరట.. ముంబై జైలు వీడియో పంపమన్న కోర్టు
భారతీయ బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
భారతీయ బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భారత్‌కు అప్పగింత కేసులో విజయ్‌మాల్యా తన కొడుకు సిద్ధార్థ్‌తో కలిసి విచారణకు హాజరయ్యారు. భారత్ తరఫున ఈడీ, సీబీఐ బృందం హాజరయ్యింది. కేసును విచారించిన కోర్టు విజయ్‌మాల్యాకు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాక.. మాల్యాను అప్పగిస్తే ముంబై జైలు వీడియోను కోర్టుకు సమర్పించాల్సిందిగా కోరింది. ఇందుకు భారత ప్రభుత్వం అంగీకరించగా.. తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది.
ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో మాల్యా మాట్లాడారు. భారతీయ బ్యాంకులకు రుణాలు చెల్లించాలని కోర్టు ఆదేశిస్తే తప్పకుండా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనకు ఉన్న రూ.14వేల కోట్ల ఆస్తులను అమ్మకానికి పెట్టి రుణాలు చెల్లిస్తానన్నారు. అప్పులు చెల్లించడం లేదని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. అప్పులు తిరిగి చెల్లించడం తనకు సంతోషమని, గతంలోనే ఆస్తుల అమ్మకంపై కర్ణాటక హైకోర్టు అనుమతి కోరినట్లు తెలిపారు.