సౌదీ అరేబియా ప్రపంచంలోనే తొలిసారిగా ఒక రోబోట్‌కి పౌరసత్వమిచ్చిన దేశంగా వార్తల్లోకెక్కింది.  ఆ రోబోట్ పేరు సోఫియా. హాంగ్‌కాంగ్ కంపెనీ హాన్సన్ రోబోట్స్ ఈ రోబోట్‌ని తయారుచేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్దపీట వేస్తున్న దేశాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందడం కోసమే సౌదీ అరేబియా ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అయితే ఇదే నిర్ణయాన్ని చాలా సంస్థలు తప్పుబట్టాయి. ప్రజల పౌరసత్వ హక్కులే కాలరాయబడుతున్న వేళ.. ఒక రోబోట్‌కు ఆ ఘనతను అందివ్వడం హాస్యాస్పదమని పలువురు అభిప్రాయపడ్డారు. సౌదీ రాజధాని రియాద్‌లో జరిగిన ఒక బిజినెస్ కార్యక్రమంలో ప్రభుత్వం సోఫియాకి పౌరసత్వాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తనకు పౌరసత్వం కల్పించడం పట్ల రోబోట్ స్పందించింది. తాను మనుష్యులతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని, అలాగే వారి నమ్మకాన్ని కూడా తప్పకుండా పొందుతానని తెలిపింది.