శ్రీహరికోట: చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపైకి ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణ కోసం ఇస్రో తీవ్రంగా కృషిచేస్తోన్న సంగతి తెలిసిందే. విక్రమ్ ల్యాండర్‌ని అన్వేషించే పనిలో ఇస్రోకు తోడుగా అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా రంగంలోకి దిగింది. విక్రమ్‌ ఆచూకీ తెలుసుకునేందుుకు డీప్‌స్పేస్‌ నెట్‌వర్క్‌ సెంటర్లు, జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌ ద్వారా నాసా రేడియో సంకేతాలు పంపుతోంది. ఇదివరకు నాసా ప్రయోగించిన 'లూనార్‌ ఆర్బిటర్‌' కూడా ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలోనే తిరుగుతోంది. ఈ నెల 17న విక్రమ్ ల్యాండర్‌ ఉన్న దక్షిణ ధృవం వైపునకు వెళ్లనున్న నాసా లూనార్ ఆర్బిటర్.. తీసే ఫోటోల్లోనూ విక్రమ్ జాడ తెలిసే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. లూనార్ ఆర్బిటర్ తీసే చిత్రాలను ఇస్రోకు అందజేస్తామని నాసా అధికార ప్రతినిధి వెల్లడించారు. 


ఇదిలావుంటే, ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2పై నాసా ఎందుకింత ఆసక్తి కనబరుస్తోందంటే.. అందుకూ ఓ కారణం లేకపోలేదు. చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి 2024లో వ్యోమగాములను పంపేందుకు సిద్ధమవుతున్న నాసా.. అంతకన్నా ముందుగా అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు వీలుగా ల్యాండర్‌ విక్రమ్‌లో గొడార్డ్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌కు చెందిన 'లేజర్‌ రెట్రోరిఫ్లెక్టర్‌ యారే' పరికరాలను అమర్చింది. ఒకవేళ చంద్రయాన్-2 సఫలమైతే.. ఈ ప్రయోగంతో నాసాకు సైతం ప్రయోజనం చేకూరనుంది. దీంతో విక్రమ్ జాడ కనుక్కునేందుకు నాసా సైతం తన వంతు ప్రయత్నాలను మొదలుపెట్టింది.