పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(68) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్  ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు షరీఫ్‌ను  పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(పీఐఎంఎస్)లో చేర్చారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందని ఆయన జైలు అధికారులకు చెప్పడంతో వైద్యులు వచ్చి తనిఖీలు చేశారు. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో పీఐఎంఎస్‌కు తీసుకెళ్లారు. షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి ఐదుగురు వైద్య నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. అవినీతి కేసులో నవాజ్ షరీఫ్ పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. జులై 13 నుండి ఆయన అదియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల ఫలితాలపై నవాజ్ షరీఫ్ స్పందన


రెండు రోజుల క్రితం నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత‍్వంలోని ‘పాకిస్తాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌’ (పీటీఐ) అతి పెద్ద పార్టీగా అవతరించిన తరుణంలో.. ఎన్నికలు దొంగిలించబడ్డాయంటూ వ్యాఖ్యానించారు. తాజా పాకిస్తాన్‌ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో చెడు సంకేతాలకు నిదర్శమన్నారు.


పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలు 2018


ఇదిలా ఉంచితే, గతవారం జరిగిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించింది. మొత్తం 272 స్థానాలకు ఎన్నికలు జరుగగా, ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని 'పాకిస్థాన్‌ తెహ్రీక్‌ - ఎ - ఇన్సాఫ్‌' (పీటీఐ) 116 స్థానాలు గెలుచుకుందని ఈసీ పేర్కొంది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ - ఎన్ (పీఎంఎల్‌-ఎన్‌) 64 చోట్ల గెలిచి రెండో స్థానంలో నిలువగా, బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) 43 చోట్ల గెలిచి మూడో స్థానంలో నిలిచింది. మిగతా సీట్లలో అత్యధికం స్వతంత్రులకు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 137.  ఇమ్రాన్ ఖాన్‌కు ఇంకా 21 మంది సభ్యుల మద్దతు అవసరం. దీనికోసం ఆయన చిన్న పార్టీల మద్దతును కోరుతున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం ఆగస్టు 14 (పాక్ స్వాతంత్ర్య దినోత్సవం)కు అటూ ఇటుగా ఉంటుందని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.