2019లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలంటూ భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానంపై అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్పందించింది. భారత ప్రభుత్వం ఆహ్వానంపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. త్వరలోనే ట్రంప్ ఓ నిర్ణయానికి వస్తారని తెలిపింది. దీంతో ట్రంప్‌ భారత్‌కు వస్తారా?లేదా? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానం అందింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు’ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ సారా శాండర్స్‌ మీడియాకు చెప్పారు. త్వరలో అమెరికా-భారత్‌ మధ్య 2+2 వ్యూహాత్మక చర్చలు జరుగుతాయని, ఆ తర్వాతే ట్రంప్ భారత పర్యటనపై ఓ నిర్ణయానికి వస్తారని తెలిపారు. 2+2 చర్చల్లో పాల్గొనడటానికి సెప్టెంబర్‌లో అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు మైక్‌ పాంపెయో, జిమ్‌ మాటిస్‌‌లు భారతదేశాన్ని సందర్శిస్తారని సారా తెలిపారు.  



 


ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 6న 2+2 చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో భారత విదేశాంగ, రక్షణ మంత్రులు సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. కాగా..జూలైలోనే జరగాల్సి ఈ చర్చలు కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక, రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు ఈ చర్చలు జరగనున్నాయి.