మెత్తబడిన ఉ.కొరియా.. అణు పరీక్షలను ఆపేస్తాం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, అణు పరీక్ష మరియు ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిలిపివేస్తామని శనివారం (ఏప్రిల్ 21)రోజున తెలిపారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, అణు పరీక్ష మరియు ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిలిపివేస్తామని శనివారం (ఏప్రిల్ 21)రోజున తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, కిమ్ యొక్క ప్రకటన స్వాగతించారు. ఈ ఇద్దరు నాయకుల భేటీ మే నెలలో జరగనుంది. ఉత్తరకొరియా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటి ప్యాంగాంగ్‌లో శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. వచ్చే వారంలో ఉత్తర, దక్షిణ కొరియా దేశాధినేతల సమావేశం జరుగనుంది. ఈనేపథ్యంలో కొత్తదశ విధానాలపై పార్టీ సభ్యులు చర్చించారు. పొరుగుదేశాలతో మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలు కోరు కుంటున్న కిమ్ 2011లో అధికారం చేపట్టిన తర్వాత జరిపిన తొలి విదేశీ పర్యటనలో భాగంగా గత నెలలో చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే.
కొరియా దేశాల ఘర్షణకు స్వస్తి చెప్తూ శాంతి ఒప్పందం కుదిరే విధంగా ప్రయత్నాలు జరుగాలని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌జే యిన్ అన్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్‌తో వచ్చే శుక్రవారం భేటీ కాబోతున్న నేపథ్యంలో.. ఉభయ కొరియా నాయకుల భేటీలో గానీ, ఉత్తరకొరియా- అమెరికా అధ్యక్షుల సదస్సులోగానీ జరిపే చర్చలు అణునిరాయుధీకరణకు దారితీయాలి. ఉత్తరకొరియా అణ్వాయుధాలు విడిచి పెడితేనే శాంతి ఒప్పందం సాధ్యమవుతుంది అని ఆయన చెప్పారు.
మే నెలలో తాను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కొరియా దేశాల అణునిరాయుధీకరణ గురించి ఉన్‌తో చర్చిస్తానని, ఒకవేళ చర్చలు సఫలంకాకపోతే మధ్యలోనే వచ్చేస్తానని ట్రంప్ అన్నారు. శాంతిచర్చలు సఫలమైతే దశాబ్దాల తరబడి దూరంగా ఉంటున్న రెండు కొరియా దేశాల ప్రజలు ఇకపై శాంతిసౌభాగ్యాలతో, భద్రతాభావంతో కలిసి జీవిస్తారని ట్రంప్ అన్నారు.