ఆ బటన్.. ఎప్పుడూ నా టేబుల్ పైనే ఉంటుంది
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్ కొత్త సంవత్సరం సందర్భంగా.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
న్యూఢిల్లీ, జనవరి1: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ కొత్త సంవత్సరం సందర్భంగా.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా తన పరిధిలో ఉందని, న్యూక్లియర్ బటన్ తన కార్యాలయాల డెస్క్ మీద ఉందని చెప్పారు.
"నా టేబుల్ పై ఒక బటన్ ఉంటుంది. అది నొక్కితే అంతా నాశనమే.. ఆ బటన్ అణ్వాయుధానికి సంబంధించినదని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఏ శక్తీ ఛేదించలేని ఒక అణ్వస్త్ర దేశంగా ఉత్తర కొరియా మారాలి" అని అన్నారు. ఉత్తర కొరియా అణు ఆయుధాలను, బాలిస్టిక్ క్షిపణులను 2018లో భారీ సంఖ్యలో ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. అయితే, ఈ ఆయుధాలు భద్రతా ప్రయోజనం కోసం ఉపయోగించబడుతాయని చెప్పారు.
యుద్ధం గురించి మాట్లాడిన తరువాత, కిమ్ జోంగ్- ఉన్ శాంతి గురించి మాట్లాడారు. దక్షిణ కొరియా మరియు ఉత్తర కొరియా మధ్య కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. దక్షిణ కొరియాతో సంబంధాలను మెరుగుపర్చుకుంటామని ఓపెన్ ఆఫర్ చేశారు. కొరియా ద్వీపకల్పంపై సైనిక మిలిటరీ ఉద్రిక్తతలను తగ్గించడం మరియు దక్షిణాన సంబంధాలను పెంపొందించడం అత్యవసరం అని కిమ్ పేర్కొనడంతో.. ఇరుదేశాలు ఇప్పుడు ఎలా ముందుకు వెళతాయో చూడాలి.
దక్షిణ కొరియాలో పియోంగ్చాంగ్లో జరిగే వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ కు ఉత్తర కొరియా తరుఫున ఒక ప్రతినిధి బృందాన్ని పంపించవచ్చని కూడా ఆయన అన్నారు. "వింటర్ గేమ్స్ లో ఉత్తర కొరియా పాల్గొంటుంది. ప్రజల మధ్య ఐక్యత చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం. మేము ఈ క్రీడలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాం" అన్నారు. ఇరుదేశాల అధికారులు తక్షణమే చర్చల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పారు.